ఒబామా కొన్న నవల ఏంటో తెలుసా?

14 Aug, 2015 12:59 IST|Sakshi
ఒబామా కొన్న నవల ఏంటో తెలుసా?

వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన రచయిత్రి జుంపా లాహిరి రాసిన ఓ పుస్తకాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవలే కొన్నారని తెలుస్తోంది. పులిట్జర్ అవార్డు గ్రహీత జుంపా రాసిన రెండో నవల 'ద లోల్యాండ్'ను ఒబామా త్వరలోనే చదువుతారని ఓ అధికారి తెలిపారు. ఒబామా కుటుంబు సభ్యులతో సహా ప్రస్తుతం వేసవి విడిది నిమిత్తం మసాచుసెట్స్ లోని మార్తా విన్ యార్డ్ ద్వీపంలో ఉన్నారు. అయితే ఇందులో భాగంగా ఆయన తన వెంట ఆరు నవలలు తీసుకెళ్లగా, అందులో 'ద లోల్యాండ్' ఒకటి. ఈ నవలను జుంపా లాహిరి 2013లో రాశారు. ఇందులో కోల్కతాకు చెందిన ఇద్దరు సోదరుల విషయాలను ప్రస్తావించారు.

ఈ బుక్ 2013లో మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు నామినేషన్ నవలల జాబితాలో స్థానం సంపాదించింది. మిగతా నవలల్ని డిజిటల్ లేదా హార్డ్ కాపీ రూపంలో చదువుతారో తెలియదని, లాహిరి నవలను మాత్రం హార్డ్ కాపీనే చదవనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఒబామా 'ద లోల్యాండ్'ను ఇటీవలే కొన్నారని సమాచారం. అంతేగాక ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలో అధ్యక్షుడి కమిటీలో జుంపా లాహిరిని సభ్యురాలిగా స్వయంగా ఒబామా నియమించారు. 1999లో  లాహిరి రాసిన కాల్పనిక నవల 'ఇంటర్ప్రిటర్ ఆఫ్ మాల్దీవ్స్' 2000 ఏడాది 'పులిట్జర్ ప్రైజ్' గెలుపొందిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు