ప్యారిస్‌ నదిపై జిమ్‌ జర్నీ

15 Dec, 2016 03:19 IST|Sakshi
ప్యారిస్‌ నదిపై జిమ్‌ జర్నీ

ప్యారిస్‌ : విద్యుత్తు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం రూపురేఖలు మారిపోయాయి. ఇందులో డౌటేమీ లేదు. కానీ పెరిగిపోతున్న భూతాపం, వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో ఈ స్వరం మారుతోంది. కరెంటు వద్దని అనడం లేదుగానీ... అవకాశమున్న చోటల్లా సంప్రదాయేతర ఇంధన వనరులను వాడుకుందామన్నది ఈ సరికొత్త ఆలోచన. ఇటలీ ఆర్కిటెక్ట్‌ ‘కార్లో రాటీ అసోసియేటీ’ తాజా డిజైన్‌ దీనికి పక్క సాక్ష్యంగా కనిపిస్తోంది. ప్యారిస్‌ నగరంలోని సీన్‌ నదిని దాటేందుకు వీరు డిజైన్‌ చేసిన పడవ ప్లస్‌ జిమ్‌ ఇది. పెట్రోలు, డీజిళ్లను పక్కనబెట్టి లోపలున్న వాళ్లు సైకిల్‌ తొక్కితేనే ఈ పడవ నడుస్తుంది.

దాదాపు 20 మీటర్ల పొడవున్న ఈ పడవలో ఆట్రిస్‌ వ్యాయామ యంత్రాలను బిగించారు. సైకిల్‌ తొక్కినా... బరువులెత్తినా మనుషులు వాడిన శక్తిని ఇవి విద్యుత్తు మార్చి బ్యాటరీల్లో నిల్వ చేస్తాయి.  పడవ పైభాగాన మొత్తం పారదర్శకమైన గాజు లాంటిది ఏర్పాటు చేశారు. ఇది పరిసరాలను గమనించేందుకు మాత్రమే కాదు...వ్యాయామం తాలూకూ వివరాలు (దూరం, వేగం, కరిగిన కేలరీలు వంటివి) కనిపించే స్క్రీన్స్‌గానూ పనిచేస్తుంది. ఒక్కో పడవ జిమ్‌లో ఏకకాలంలో 45 మంది వరకూ వ్యాయామం చేయవచ్చు. ప్యారిస్‌ నగరంలో ఈ జిమ్‌ను ఏడాది పొడవునా అందుబాటులో ఉంచుతామని, నగరాన్ని ఓ కొత్త కోణంలో చూసేందుకు ఇది ఉపయోగపడుతుందని కార్లో రాటీ అసోసియేటీ అంటోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ పడవ జిమ్‌ను సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మధ్య లండన్‌లో ఒక బస్‌లోనూ ఇలాంటి జిమ్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే!

మరిన్ని వార్తలు