జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు రాయిటర్స్‌ షాక్‌ : వేల కోట్లు హాంఫట్‌

15 Dec, 2018 17:34 IST|Sakshi

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌పై  రాయిటర్స్‌ సంచలనం కథనం

బేబీ పౌడర్‌లో కాన్సర్‌ కారక ఆస్‌బెస్టాస్‌ ఆనవాళ్లు

ఈ విషయం  సంస్థకు ముందే తెలుసు - రాయిటర్స్‌

మూడు దశాబ్దాలుగా మభ్యపెడుతోంది - రాయిటర్స్‌

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థకు అంతర్జాతీయ మీడియా సంస్థ భారీ షాక్‌ ఇచ్చింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు తమ బేబీపౌడర్‌లో క్యాన్సర్‌ కారకాలున్నాయన్న సంగతి ముందే తెలుసునని రాయటర్స్‌ తాజాగా  వాదిస్తోంది.  అయితే ఈ విషయంలో దశాబ్దాల తరబడి వినియోగదారులను మోసం చేస్తూ వస్తోందని విమర్శించింది. ఆస్‌బెస్టాస్‌  మూలంగా మేసోథెలియోమా లాంటి  అనేక అరుదైన, బాధాకరమైన  కాన్సర్లకుదారి తీస్తుందని  పేర్కొంది. దీంతో వివాదాలు, పలు కేసులు,  కోర్టు తీర్పులతో ఇబ్బందుల్లో పడిన అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు  మరో ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఈ రిపోర్టును ఎప్పటిలాగానే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తిరస్కరించింది.

తమ బేబీ టాల్కమ్‌ పౌడర్‌లో ఆస్‌బెస్టాస్‌ అనే క్యాన్సర్‌ కారకం ఉన్నట్లు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి దశాబ్దాలుగా తెలుసని రాయిటర్స్‌  కథనం పేర్కొంది. బేబీ పౌడర్‌లో ఆస్‌బెస్టాస్‌ ఆనవాళ్లు ఉన్నట్లు 1971లోనే జాన్సస్‌ సంస్థ గుర్తించిందని తెలిపింది. ఈ విషయమై ఇటీవల కంపెనీపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయిటర్స్‌ మీడియా సంస్థ పలు పత్రాలను అధ్యయనం చేసి మరీ  నిర్ధారించింది.  అయితే ఇది తక్కువ మోతాదు, హానికరం కాదంటూ  రెగ్యులేటరీ సంస్థలను ఒప్పించటానికి ప్రయత్నం చేసిందని, కానీ ఈ సంవత్సరం న్యూజెర్సీ న్యాయమూర్తి జాన్సన్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన  తీర్పును ఉటంకిస్తూ రాయటర్స్‌ నివేదించింది.

అయితే ఈ వార్తలను జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కొట్టిపారేసింది. ఇవన్నీ కల్పిత వార్తలని, నిజాన్నితప్పుదోవ పట్టించేందుకు చేసే ప్రయత్నాలను కంపెనీ ఆరోపించింది. తమ టాల్కం పౌడర్‌లో ఎలాంటి క్యాన్సర్‌ కారకాలు లేవని ఇప్పటికే చాలా పరీక్షలు రుజువుచేశాయని కంపెనీ గ్లోబల్‌ మీడియా రిలేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎర్నీ నీవిట్జ్‌ తెలిపారు. అయితే బేబీ పౌడర్‌ కాకుండా పారిశ్రామిక అవసరాలకోసం ఉద్దేశించిన తమ టాల్క్ బ్యాచ్‌లలో ఆస్‌బెస్టాస్‌ ఆనవాళ్లు ఉండి వుండవచ్చని  వాదించారు.

కాగా జాన్సన్‌ అండ్‌ జాన్స్‌  బేబీ పౌడర్‌తో పాటు షవర్‌ ఉత్పత్తుల్లోనూ క్యాన్సర్ కారకాలు ఉన్నాయని, తద్వారా తమకు క్యాన్సర్‌ సోకిందన్న ఆరోపణలపై  వేలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే బాధితులను వాదనలను సమర్థించిన పలుకోర్టులు పరిహారం చెల్లించాల్సిందిగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌  సంస్థను ఆదేశించిన సంగతి తెలిసిందే.

2006లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక  విభాగం జాన్సన్‌కు చెందిన జననేంద్రియ ప్రాంతాల్లో ఉపయోగించే  (వెజైనల్‌) టాల్క్ అండాశయ క్యాన్సర్‌కు కారణం కావచ్చని ఒక ప్రకటన జారీ చేసింది, అయితే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఈ ఆరోపణకు ఎలాంటి ఆధారం లేదని కొట్టి పారేసింది.

మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో అమెరికా మార్కెట్లో శుక్రవారం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ షేర్లు కుప్పకూలాయి. షేరు విలువ 10శాతం మేర పడిపోయింది.   45బిలియన్‌ డాలర్ల సంపద (సుమారు 32వేల కోట్ల రూపాయలు) తుడిచిపెట్టుకుపోయింది.  16ఏళ్లలో కంపెనీ షేర్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారని  బిజినెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు