భావ ప్రకటనా స్వేచ్ఛ: లిబరల్స్‌ ఆందోళన!

9 Jul, 2020 13:59 IST|Sakshi

వాషింగ్టన్‌: సామాజిక అంశాల పట్ల గళమెత్తే ఉదారవాదులను అణచివేసేందుకు ప్రయత్నించే కొన్ని వర్గాలకు అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్న శక్తిమంతమైన వ్యక్తులు తోడయ్యారని పలువురు రచయితలు, విద్యావేత్తలు డొనాల్డ్‌ ట్రంప్‌ను విమర్శించారు. అలాంటి వారితో ప్రజాస్వామ్యానికి పెను ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిని ఉపేక్షించకూడదని.. అయితే ఏకాభిప్రాయం కుదరనంత మాత్రాన లిబరల్స్‌ మధ్య విభేదాలు తలెత్తడం విచారకరమన్నారు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జేకే రౌలింగ్‌, సల్మాన్‌ రష్దీ, మార్గరెట్‌ అట్‌వుడ్‌ వంటి దాదాపు 150 మంది రచయితలు సంతకం చేసిన లేఖను ప్రఖ్యాత ‘హార్పర్స్‌ మ్యాగజీన్’ మంగళవారం ప్రచురించింది.(మెలానియా విగ్రహం ధ్వంసం) 

ఆఫ్రో- అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో అమెరికాలో వెల్లువెత్తిన నిరసనలు, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలనే డిమాండ్లు సహా ఇతర సామాజిక అంశాలపై ధైర్యంగా పోరాడుతున్న వారిపై అణచివేత ధోరణి అధికమవుతున్న వేళ ఈ మేరకు పలువురు తమ అభిప్రాయాలను లేఖలో పంచుకున్నారు. స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడిస్తున్న వారిపై పెరిగిపోతున్న అసహనం, సెన్సారియస్‌నెస్‌(పదే పదే విమర్శించడం) పై ఆందోళన వ్యక్తం చేశారు. (చైనాపై కఠిన చర్యలకు సిద్ధమైన అమెరికా!)

‘‘అభివృద్ధి జరిగినపుడు ప్రశంసించే మేము.. అలా జరగని పక్షంలో గొంతెత్తేందుకు సిద్ధంగా ఉంటాం. ఉదారవాదులపై అక్కసు వెళ్లగక్కే కొన్ని శక్తులకు డొనాల్డ్‌ ట్రంప్‌ వంటి వ్యక్తులు తోడయ్యారు. ప్రస్తుత సమాజంలో స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తపరచడం సహా ఆలోచనలు పంచుకోవడం కష్టంగా మారింది. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. రైట్‌వింగ్‌ రాడికల్‌ శక్తులు నైతిక హక్కులు కాలరాసేలా ప్రవర్తిస్తున్నాయి. వాటి కారణంగా మీడియా, కళారంగం వారు స్వేచ్చగా భావాలు వెల్లడించలేకపోతున్నారు. జీవనోపాధి కోల్పోతామనే భయం, కొన్ని ఒప్పందాల కారణంగా జర్నలిస్టులు భయపడాల్సి వస్తోంది. ఇక రచయితలు, ఆర్టిస్టులు ఇప్పటికే అనేక రకాలుగా మూల్యం చెల్లించి ఉన్నారు’’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ లేఖపై కూడా సోషల్‌ మీడియాలో మిశ్రమ స్పందన రావడం గమనార్హం. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్ల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేకే రౌలింగ్‌ కూడా ఈ లెటర్‌పై సంతకం చేయడం విశేషమంటూ పలువురు విమర్శిస్తున్నారు.(హిజ్రాలంటే నాకిష్టం: న‌టి)

మరిన్ని వార్తలు