ట్రంప్‌పై జో బిడెన్‌ ఫైర్‌

23 Jul, 2020 09:11 IST|Sakshi

‘తొలి రేసిస్ట్‌ ప్రెసిడెంట్‌ ఆయనే’

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్పై డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉంటారని భావిస్తున్న  జో బిడెన్‌ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రంప్‌ వైట్‌హౌస్‌కు ఎంపికైన తొలి రేసిస్ట్‌ అని మండిపడ్డారు. కరోనా మహమ్మారిని తరచూ చైనా వైరస్‌ అని  అధ్యక్షుడు పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను వారి రంగు, జాతీయత ఆధారంగా చూసే ట్రంప్‌ తీరును జో బిడెన్‌ తప్పుపట్టారు. గతంలో ఏ అధ్యక్షుడు ట్రంప్‌లా వ్యవహరించలేదని దుయ్యబట్టారు. ‘ఏ రిపబ్లికన్‌, డెమొక్రటిక్‌ అధ్యక్షుడు ఇలా వ్యవహరించలేదు..వర్ణవివక్ష, జాతివివక్షతో కూడిన ఎందరో అధ్యక్ష పదవి చేపట్టాలని ప్రయత్నించారు..ఆ ప్రయత్నంలో ఎన్నికైన తొలి అధ్యక్షుడు ట్రంప్‌’అని వ్యాఖ్యానించారు. చదవండి : అగ్రదేశాల దౌత్య యుద్ధం

అమెరికన్లను ఏకతాటిపైకి తీసుకురావడాన్ని విస్మరించి ప్రజలను, దేశాన్ని విభజించేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ట్రంప్‌ అన్నిటికీ చైనాను టార్గెట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కాగా బిడెన్ వ్యాఖ్యలు నల్ల జాతీయుల మేథస్సును అవమానించేలా ఉన్నాయని ట్రంప్‌ క్యాంపెయిన్‌ సీనియర్‌ సలహాదారు కట్రినా పియర్సన్‌ అన్నారు. గతంలో బరాక్‌ ఒబామా మెరుగైన పనితీరు కనబరిచే తొలి ఆఫ్రికన్‌ అమెరికన్‌ అంటూ చేసిన వ్యాఖ్యలపై జో బిడెన్‌ క్షమాపణలు కోరిన విషయాన్ని కట్రినా ప్రస్తావించారు. అధ్యక్షుడు ట్రంప్‌ ప్రజలందరినీ అభిమానిస్తారని, అమెరికన్ల సాధికారత కోసం శ్రమిస్తున్నారని, నల్లజాతీయుల నుంచి  ఏ రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్ధికీ లభించని మద్దతు ఆయనకు లభిస్తోందని చెప్పుకొచ్చారు. జో బిడెన్‌ నుంచి వర్ణ వివక్షపై ఏ ఒక్కరూ పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో లేరని అన్నారు. 

మరిన్ని వార్తలు