2020 ఎన్నికలు: ఇండో-అమెరికన్‌కు కీలక బాధ్యతలు

30 Jun, 2020 20:51 IST|Sakshi

జో బిడెన్ క్యాంపెయిన్‌ డిజిటల్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా మేధా రాజ్‌‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే అధికార రిపబ్లికన్‌ పార్టీ, ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ ప్రచార దూకుడును పెంచాయి. పోటాపోటీగా దూసుకుపోతూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఢీకొట్టేందుకు.. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున బరిలో దిగిన జో బిడెన్ అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వర్చువల్‌ ప్రచారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఆయన.. ఇండో- అమెరికన్‌ మేధా రాజ్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. తన క్యాంపెయిన్‌ డిజిటల్‌ చీఫ్‌గా ఆమెను నియమించుకున్నట్లు పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. అన్ని డిజిటల్‌ విభాగాలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో మేధా రాజ్‌ ముందుండి నడవనున్నారని పేర్కొన్నారు. (నాడు సరితా కోమటిరెడ్డి.. నేడు విజయ్‌ శంకర్‌!)

ఇక ఈ విషయాన్ని మేధా రాజ్‌ కూడా ధ్రువీకరించారు. ‘‘జో బిడెన్‌ క్యాంపెయిన్‌ డిజిటల్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా ఎంపికైన విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. 130 రోజుల్లో ఎన్నికలు. ఒక్క నిమిషం కూడా వృథా చేయబోం’’ అంటూ జూన్‌ 26న సోషల్‌ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కాగా జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్‌ పాలిటిక్స్‌లో పట్టా పొందిన మేధారాజ్‌.. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. (ట్రంప్ ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తి: మేరీ ట్రంప్)

ఇక జో బిడెన్‌ క్యాంపెయిన్‌ కొత్త డిప్యూటీ డిజిటల్‌ డైరెక్టర్‌గా క్లార్క్‌ హంప్రే(గతంలో హిల్లరీ తరఫున ప్రచారం), కొత్త డిజిటల్‌ ఆర్గనైజింగ్‌ డైరె​క్టర్‌గా జోస్‌ న్యూనెజ్‌, డిజిటల్‌ పార్టనర్‌ షిప్స్‌ డైరెక్టర్‌గా క్రిస్టియన్‌ టామ్‌ ప్రచార బాధ్యతల్లో పాలుపంచుకోనున్నారు. కాగా తాజాగా విడుదలైన ఒపీనియన్‌ పోల్స్‌ ప్రకారం జో బిడెన్‌ ట్రంప్‌ కంటే ఎనిమిది పాయింట‍్ల ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు