హెచ్‌–1బీపై నిషేధం ఎత్తివేస్తా

3 Jul, 2020 04:45 IST|Sakshi

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జో బిడెన్‌ హామీ

భారత్‌తో సంబంధాలకు ప్రాధాన్యమిస్తానని వెల్లడి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ భారతీయ ఐటీ ఉద్యోగులపై హామీల వర్షం కురిపించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే అమెరికా సహజ భాగస్వామి భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత దృఢతరం చేసుకునేందుకు ప్రాధాన్యమిస్తానని ప్రకటించారు. ఇంకా, హెచ్‌–1బీ వీసాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంతోపాటు ఇమిగ్రేషన్‌ వ్యవస్థను ఆధునీకరిస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆన్‌లైన్‌ పద్ధతిలో జరిగిన ఒక టౌన్‌హాల్‌ సమావేశంలో బిడెన్‌ ఆసియన్‌ అమెరికన్‌ అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్లతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ట్రంప్‌ హెచ్‌–1బీ వీసాలను ఈ ఏడాది మొత్తానికి రద్దు చేశారు. నా ప్రభుత్వంలో మాత్రం ఇలా జరగదు’’అని వ్యాఖ్యానించారు.

ప్రైవేట్‌ కంపెనీల వీసాలపై అమెరికా వచ్చిన నిపుణులు దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్ష పగ్గాలు చేపడితే వంద రోజుల్లో వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తామని అన్నారు. ‘‘తొలిరోజే (అధికారం చేపట్టిన తరువాత) ఇమిగ్రేషన్‌ చట్టాల్లో మార్పులకు సంబంధించిన బిల్లును కాంగ్రెస్‌కు పంపిస్తా. దేశంలో తగిన పత్రాలు లేని కోటీ పదిలక్షల మంది వలసదారులకు పౌరసత్వం ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కోరతా. ఇందులో 17 లక్షల మంది ఏసియన్‌ అమెరికన్లు, పసిఫిక్‌ ఐలాండర్లు ఉంటారు’’అని బిడెన్‌ వివరించారు.  ముస్లింల ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతోపాటు సుదీర్ఘమైన అమెరికా విలువల పునరుద్ధరణలో భాగంగా దేశంలోకి మళ్లీ శరణార్థులను తీసుకుంటామని చెప్పారు. గ్రీన్‌కార్డుల పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.

అమెరికా, భారత్‌లు సహజ భాగస్వాములు
అమెరికా భారత్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలంగా ఉండటం అమెరికన్ల భద్రతకు చాలా ముఖ్యమని జో బిడెన్‌ వ్యాఖ్యానించారు. అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో తాను గతంలో  భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలకు అధిక ప్రాధాన్యమిచ్చామని అధ్యక్షుడిగా ఎన్నికైతే అదే పంథా కొనసాగిస్తానని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యవహారంలో ట్రంప్‌ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు.

>
మరిన్ని వార్తలు