నాడు అణుబాంబులు.. నేడు పుష్పగుచ్ఛాలు

11 Apr, 2016 19:22 IST|Sakshi

కాలంతోపాటు గాయం మానిపోతుందంటారు. చరిత్రలోనే అత్యంత హేయమైన నరమేధాన్ని ఎదుర్కొన్న జపాన్ కూడా 'ఎన్నటికీ మర్చిపోలేని' గాయాన్ని మాన్పుకోవాలనుకుంటోంది. నాటి శత్రుదేశాలతో స్నేహం కోరుకుంటోంది. జీ7(గ్రూప్ ఆఫ్ సెవెన్) కూటమి ద్వారా ఆ ప్రక్రియకు గతంలోనే బీజాలు పడినప్పటికీ సోమవారం చోటుచేసుకున్న పరిణామంతో అది చారిత్రక మలుపుతిరిగింది. నాడు హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబులు కురిపించిన అమెరికా నేడు పుష్పగుచ్ఛాలతో అణుబాంబు మృతుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించింది.
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ సహా జీ7 దేశాల మంత్రుల బృందం సోమవారం హిరోషిమాలోని అణుబాంబు మృతుల స్మారక స్థూపాన్ని సందర్శించింది. నాటి విధ్వంసంలో మరణించిన లక్షలాదిమందికి నివాళులు అర్పించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక అమెరికా విదేశాంగ మంత్రి హిరోషిమాను సందర్శించడం ఇదే మొదటిసారి కావటంతో జాన్ కెర్రీ పర్యటనపై సర్వత్రా ఆసక్తినెలకొంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ చేరుకున్న జాన్ కెర్రీ ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఇటలీ, కెనడా దేశాల మంత్రులతో కలిసి జపాన్ తో చర్చలు జరుపుతారు. పలు అభివృద్ధి అంశాలు, ఆర్థిక ఒప్పందాలపై అవగాహన కుదుర్చుకుంటారు.

జపాన్ లో అడుగుపెట్టకముందు అమెరికాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కెర్రీ హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసినందుకు జపాన్ కు క్షమాపణలు చెప్పబోయేదిలేదని కుండబద్దలు కొట్టారు. దాదాపు మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన నాటి సంఘటనపట్ల విచారం వ్యక్తచేస్తామేతప్ప క్షమాపణలు కోరమని కెర్రీ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా 1945, ఆగస్టు 6న జపాన్ లోని పారిశ్రామిక నగరం హిరోషిమాపై అమెరికా యుద్ధవిమానాలు అణుబాంబు వేశాయి. మూడు రోజుల తర్వాత (ఆగస్టు 9న) తీర పట్టణం నాగసాకిపై మరో అణుబాబు పడింది. రెండు ఘటనల్లో దాదాపు మూడు లక్షల మంది చనిపోగా, 30 ఏళ్లపాటు రేడియేషన్ ఎఫెక్ట్ కొనసాగింది.

మరిన్ని వార్తలు