జోకు పేల్చినందుకు.. 55 లక్షల జరిమానా!

4 Dec, 2014 08:18 IST|Sakshi
జోకు పేల్చినందుకు.. 55 లక్షల జరిమానా!

విమానాశ్రయంలో బాంబు ఉందంటూ జోకు వేసిన వెనెజులాకు చెందిన ఈ వైద్యుడు ఆనక భారీ మూల్యమే చెల్లించుకున్నాడు. మానుయెల్ ఆల్బర్టో ఆల్వరాడో (60) అనే ఇతడు అక్టోబర్ 22న కొలంబియాకు వెళ్లేందుకని అమెరికాలోని మియామీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే ఎందుకు బుద్ధిపుట్టిందో గానీ.. విమానాశ్రయ సిబ్బంది ముందు ఓ మాంచి జోకు పేల్చాలని అనుకున్నాడు.

ఇంకేం.. తన లగేజీలో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ ఓ గేటు దగ్గర గార్డుతో జోకాడు. కానీ దీనిని ఆ గార్డు సీరియస్‌గా తీసుకోవడంతో ఇక ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. ఐదు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలను నిలిపివేశారు. డాగ్‌స్క్వాడ్, భద్రతా సిబ్బంది బిలబిలమంటూ రంగంలోకి దిగారు. విమానాశ్రయమంతా జల్లెడపట్టారు. మొత్తం మీద మూడు గంటలపాటు విమానాశ్రయం స్తంభించిపోయింది.

చివరకు బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్న అధికారులు చెత్త జోకుతో తిప్పలు పెట్టినందుకు ఈయనను అరెస్టు చేశారు. దీంతో మూర్ఖత్వంతో చాలా పెద్ద తప్పు చేశానని బాధపడుతూ ఇతడు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పా డు. నేర చరిత్ర లేకపోవడంతో కోర్టూ క్షమించింది. కానీ.. 89 వేల డాలర్లు(రూ.55 లక్షలు) జరిమానా వడ్డించింది. ఇందులో ఐదు ఎయిర్‌లైన్స్ సంస్థలకు రూ.51 లక్షలు, మిగతా మొత్తం మియామీ పోలీసులకు చెల్లించాలని ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు