ఈ గీతతో సముద్రం మీదే ప్రయాణం..

3 Jun, 2018 01:46 IST|Sakshi

ఈ చిత్రంలో ఎరుపు రంగు గీతను చూశారా. ఈ గీత ఆకారం చూడటానికి అనేక వంపులు ఉన్నట్టు ఉంది కదా. అయితే నిజానికిది అచ్చంగా నిలువు గీత. అదేంటీ గీత అన్ని వంకరలు ఉంటే నిలువు గీత అంటారేంటీ అనుకుంటున్నారా.. నిజంగానే ఇది నిలువు గీతే.. ఎందుకంటే మన భూమి గోళాకారంలో ఉండటం వల్ల దానిమీద నిలువు గీసినా ఈ చిత్రంలోని మ్యాప్‌లో కనిపించినట్టుగా అనేక వంకరలు వస్తుంది. అలాగే మ్యాప్‌పై పెద్ద సరళ రేఖ గీసినా.. భూమి మీదకి వచ్చేసరికి అనేక వంకరలు వస్తుంది. ఈ గీతకు మరో విశిష్టత ఉంది.

ఈ గీతను పట్టుకుని వెళితే.. ఎక్కడా భూమిపై అడుగు పెట్టకుండా కేవలం సముద్ర మార్గం గుండా ప్రయాణించవచ్చు. ఎందుకంటే ఇది సముద్ర మార్గం గుండా ప్రయాణించే అతిపెద్ద సరళ రేఖ. ఈ రేఖను ఐదేళ్ల క్రితం జార్జీయాకు చెందిన పాట్రిక్‌ అండర్సన్‌ అనే వ్యక్తి రెడ్డిట్‌లో పోస్ట్‌ చేశాడు. వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి మ్యాప్‌పై రేఖను గీశాడు.

అయితే ఇది సరైనదా.. కాదా కనుక్కునేందుకు గాను ఇటీవల ఐర్లాండ్‌లోని భౌతిక శాస్త్రవేత్త రోహన్, ఇండియన్‌ ఐబీఎంలో పనిచేస్తున్న ఇంజనీర్‌ కుశాల్‌ ముఖర్జీలు అల్గారీథమ్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని ఉపయోగించి మ్యాప్‌పై గీసిన ఈ రేఖ సరైనదని వారు కనుగొన్నారు. బలూచిస్తాన్‌లో మొదలయ్యే ఈ అతిపెద్ద సముద్ర ప్రయాణం అరేబియన్‌ సముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ అట్లాంటిక్, పసిఫిక్, సౌత్‌ బేరింగ్‌ సముద్రాల మీదుగా సాగి రష్యాలోని కమ్‌చట్కా తీర ప్రాంతంలో ముగుస్తుంది. ఈ మొత్తం ప్రయాణం 32 వేల కిలోమీటర్లు ఉంటుంది.

మరిన్ని వార్తలు