గుండెల్ని కాల్చి తిన్నాడు..!

17 Apr, 2018 02:12 IST|Sakshi
నర హంతకుడు జంగిల్‌ జబ్బా

అమెరికాలో లైబీరియా నరరూప రాక్షసుడు ‘జంగిల్‌ జబ్బా’ అరెస్ట్‌

దేశంలోకి అక్రమంగా వచ్చినందుకు 30 ఏళ్ల శిక్షపడే అవకాశం  

వాషింగ్టన్‌: చేసిన పాపం ఊరికే పోదంటారు. లైబీరియా అంతర్యుద్ధంలో వందలాది మందిని పొట్టనపెట్టుకుని అమెరికాకు పారిపోయివచ్చిన ఓ నర హంతకుడి విషయంలో అదే రుజువైంది. ఓ తీవ్రవాద సంస్థకు చెందిన కమాండర్‌ మొహమ్మద్‌ జబ్బతెహ్‌(51) గతాన్ని వెలికితీసిన అమెరికా అధికారులు అతన్ని కటకటాల వెనక్కు నెట్టారు. ఈ కేసు విచారణ సందర్భంగా అతని బాధితులు ఇచ్చిన వాంగ్మూలాలు విన్న న్యాయమూర్తులు సైతం విస్తుపోయారు.

లైబీరియా నుంచి విచారణకు హాజరైన ఓ మహిళ(60) జడ్జీల ముందు వాంగ్మూలమిస్తూ.. ‘జంగిల్‌ జబ్బాగా పేరుగాంచిన మొహమ్మద్‌ జబ్బతెహ్, అతని సైనికులు మా ఊరిపై 1991లో దాడిచేశారు. నా భర్తతో పాటు, మరిది గుండెల్ని పెకలించి హత్యచేశారు. తర్వాత తినేందుకు వీలుగా ఆ గుండెలను వండాలని ఆదేశించారు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ‘ధైర్యం తెచ్చుకో. వెంటనే మంట రాజేసి ఆ గుండెల్ని వండకుంటే జబ్బతెహ్‌ నీతో పాటు నన్నూ చంపేస్తాడు’ ఆ దళ సభ్యుడు ఒకరు తనతో చెప్పాడని పేర్కొన్నారు.

లైబీరియాలోని ఓ తీవ్రవాద సంస్థకు చెందిన జబ్బతెహ్‌ అత్యంత కిరాతకుడిగా ముద్రపడ్డాడు. 1991–98 మధ్య చెలరేగిన అంతర్యుద్ధంలో అతని  సైనికులు వందలాది మందిని ఊచకోత కోశారు. చిన్నారులను సైనికులుగా మార్చడం, హత్యలు, బహిరంగ అత్యాచారాలు వంటి అకృత్యాలకు పాల్పడ్డారు. అనంతరం 1998లో అమెరికాకు శరణార్థిగా పారిపోయిన జబ్బతెహ్‌.. అక్కడే వివాహం చేసుకుని ఫిలడెల్ఫియాలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. అయితే అమెరికాలో ప్రవేశించేముందు తన నేర చరిత్రను జబ్బతెహ్‌ అధికారులకు వెల్లడించలేదు.

2013లో జబ్బతెహ్‌ గతాన్ని గుర్తించిన హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు.. అప్పట్లో జరిగిన మారణహోమం బాధితుల్ని సాక్షులుగా ప్రవేశపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో పలువురు సాక్షుల్ని విచారించిన ధర్మాసనం.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన కేసులో జబ్బతెహ్‌ను గతేడాది అక్టోబర్‌లో దోషిగా తేల్చింది. అమెరికా చట్టాలను ఉల్లంఘించిన నేపథ్యంలో జబ్బతెహ్‌కు 30 ఏళ్ల వరకూ జైలుశిక్ష విధించే అవకాశముందనీ, అలాగే అతణ్ని వెంటనే స్వదేశానికి పంపేస్తారని అధికారులు తెలిపారు. కాగా, ఈ కేసులో గురువారం ఇక్కడి కోర్టు జబ్బతెహ్‌కు శిక్ష ఖరారు చేయనుంది.  

మరిన్ని వార్తలు