చెత్తకు రీసైక్లింగ్‌

26 Apr, 2017 02:58 IST|Sakshi
చెత్తకు రీసైక్లింగ్‌

ప్రపంచంలో ఏ మూలకెళ్లినా కనిపించే సమస్య.. ప్లాస్టిక్‌ చెత్త!. బాటిళ్లు, పాలిథీన్‌ కవర్లు ఇలా రకరకాల రూపాల్లో అందరినీ చికాకుపెట్టే ప్లాస్టిక్‌ను వదలించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఈలోపుగా... పర్యావరణానికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మినీవిజ్‌ అనే డిజైనింగ్‌ కంపెనీ మాత్రం ఇకపై ప్లాస్టిక్‌ చింత వద్దంటోంది. అన్ని రకాల చెత్తను ఈ మెషీన్‌ (ఫొటోలో ఉన్నదే)లో పడేయండి.. టైల్స్‌గా మార్చేసుకోండి అంటోంది. ఈ యంత్రం పేరు కూడా చేసే పనికి తగ్గట్టుగా ఉందండోయ్‌! ‘ట్రాష్‌ప్రెస్లో’! ఓ 40 అడుగుల పొడవైన షిప్పింగ్‌ కంటెయినర్‌లో ఇమిడిపోగల ట్రాష్‌ప్రెస్లో చేసే పని చాలా తేలికైనది. వేసిన ప్లాస్లిక్‌ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేస్తుంది.

ఆ తరువాత కరిగించి టైల్స్‌ రూపంలో అచ్చు వేస్తుందన్నమాట. ఈ టైల్స్‌ను ఇళ్లల్లో, పేవ్‌మెంట్లపై ఎక్కడైనా వాడుకోవచ్చు. ఐదు ప్లాస్టిక్‌ బాటిళ్లను వాడితే ఒక టైల్‌ బయటికొస్తుందని, తగినంత చెత్త ఉపయోగిస్తే గంట తిరక్కుండానే 10 చదరపు మీటర్ల సైజున్న టైల్స్‌ను సిద్ధం చేయవచ్చునని మినీవిజ్‌ అంటోంది. అంతేకాదండోయ్‌... ఈ యంత్రం నడిచేందుకు పెట్రోలు, డీజిల్‌ లాంటివి ఏవీ వాడాల్సిన అవసరం లేదు. మొత్తం సౌరశక్తితోనే పనిచేసేలా ఏర్పాట్లు ఉన్నాయి. హిమాలయ పర్వతాల సమీపంలోని నియాన్‌బావో యూజీ హిమనదం వద్ద పర్యాటకులు వాడిపారేసిన చెత్త మొతాన్ని చక్కబెట్టేందుకు త్వరలో దీన్ని వాడనున్నారు.

మరిన్ని వార్తలు