అసలు ఆ ప్రమాదం జరిగేదే కాదు!

14 Jan, 2020 10:48 IST|Sakshi

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో

ఒటావా: అమెరికా- ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనకుండా ఉన్నట్లయితే ఉక్రెయిన్‌ విమాన దుర్ఘటన జరిగేది కాదని కెనడా ప్రధాని జిస్టిన్‌ ట్రూడో అన్నారు. ఇరు దేశాల పరస్పర ప్రతీకార దాడుల వల్ల ఎంతో మంది మృత్యువాతపడ్డారని విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్‌ విమానం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 176 మంది(82 మంది ఇరానియన్లు, 11 ఉక్రెయిన్‌ పౌరులు, 10 మంది స్వీడిష్‌ పౌరులు, నలుగురు ఆఫ్గన్లు, ముగ్గురు జర్మన్లు, ముగ్గురు బ్రిటన్‌ పౌరులు) మరణించారు. ఇక వీరిలో 63 మంది కెనడియన్లు కూడా ఉన్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన సంతాప సభకు హాజరైన ట్రూడో మాట్లాడుతూ.. ‘‘మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు లేనట్లయితే ఆ ఘటనలో మృతి చెందిన కెనడియన్లు.. ప్రస్తుతం వారి వారి కుటుంబాలతో కలిసి ఇంట్లో హాయిగా ఉండేవారు. ఇరాన్‌ అణ్వాయుధ రహిత దేశంగా మారాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ ప్రాంతంలో అమెరికా సృష్టించిన ఉద్రిక్తతలు సద్దుమణగాల్సిన అవసరం కూడా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. (విమానాన్ని మేమే కూల్చేశాం: ఇరాన్‌)

కాగా తొలుత విమానం ప్రమాదంతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఇరాన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో.. బోయింగ్‌ ఎయిర్‌లైనర్‌ను ఇరాన్‌ కూల్చివేసిందని తమకు పలు ఇంటలెజిన్స్‌ నివేదికలు అందాయన్నారు. ఇక బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సైతం జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యలను సమర్థించారు. అంతేగాకుండా విమానంపై క్షిపణి దాడి జరిగినట్లు ఉన్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఎట్టకేలకు తామే ఉక్రెయిన్‌ విమానాన్ని ఇరాన్‌ అంగీకరించిన విషయం తెలిసిందే. మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న ఇరాన్‌... బాధితుల కుటుంబాలు తమను క్షమించాలని అభ్యర్థించింది. 

ఉద్రిక్తతలు తగ్గాలనే కోరుకుంటున్నాం

ఇరాన్‌ మరో దాడి.. అమెరికా ఆగ్రహం!

మరిన్ని వార్తలు