భారత్‌ పర్యటనే ట్రూడో కొంప ముంచబోతుందా?

3 Mar, 2018 15:45 IST|Sakshi

ఒట్టావా : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌ పర్యటన ఆయన కొంప ముంచబోతోందా? అంటే.. అవుననే సర్వేలు అంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గనుక ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్‌ పార్టీ ఓటమి పాలు కావటం ఖాయమని చెబుతున్నారు. తాజాగా అక్కడ నిర్వహించిన ఓ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. 

కెనడియన్‌ నెట్‌వర్క్‌ అయిన గ్లోబల్‌ న్యూస్‌ తాము నిర్వహించిన సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది. ట్రూడో ఎనిమిది రోజుల భారత పర్యటన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోవటానికి కారణమని తెలిపింది. అందులో ఫెడరల్‌ ఎన్నికలు జరిగితే లిబరల్‌ పార్టీకి కేవలం 33 శాతం ఓట్లను మాత్రమే కైవసం చేసుకుని ఓటమి పాలవుతుందని తేల్చేసింది.

మొత్తం పోలింగ్‌లో పాల్గొన్నవారిలో 40 శాతం ప్రజలు భారత్‌తో సంబంధాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కేవలం 16 శాతం మాత్రమే ఇరు దేశాల మైత్రిపై ఆసక్తి చూపినట్లు సర్వేలో తేలిందని గ్లోబల్‌ న్యూస్‌ సీఈవో, సీనియర్‌ రాజకీయ విశ్లేషకుడు డార్రెల్ల్‌ బ్రిక్కర్‌ వెల్లడించారు. అంతేకాదు ఓటింగ్‌లో ట్రూడో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 54 శాతం ప్రజలు ఓటేసినట్లు ఆయన చెప్పారు. ఈ వ్యతిరేకంగా ఎన్నికల దాకా కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బ్రిక్కర్‌ అభిప్రాయపడ్డారు. 2019 అక్టోబర్‌లో కెనెడా ఫెడరల్‌ ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు