నిరసన కార్యక్రమంలో కెనడా ప్రధాని‌ ట్రూడో

6 Jun, 2020 19:41 IST|Sakshi

ఒట్టావా: ఆఫ్రికన్‌- అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యోదంతాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పాల్గొన్నారు. అంగరక్షకులు వెంటరాగా.. నలుపు రంగు మాస్కు ధరించి.. మోకాళ్లపై కూర్చుని జార్జ్‌కు న్యాయం జరగాలన్న నిరసనకారులకు సంఘీభావం ప్రకటించారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన ‘‘నో జస్టిస్‌- నో పీస్‌’’(న్యాయం జరగకుంటే శాంతి ఉండదు) కార్యక్రమానికి హాజరైన ట్రూడో ప్రసంగించకుండానే తిరిగి వెళ్లిపోయారు. అయితే జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉపన్యసించిన పలువురు వక్తలను ఆయన ప్రశంసించినట్లు సీఎన్‌ఎన్‌ వెల్లడించింది. కాగా తొలుత ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అన్న ప్రశ్నకు బదులివ్వని ట్రూడో.. ఒక్కసారిగా అక్కడకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరచడం విశేషం. అయితే ఆయన అక్కడకు చేరుకోగానే కొంతమంది.. ‘‘స్టాండప్‌ టూ ట్రంప్’’ అని నినదించడం గమనార్హం.‌  (‘నువ్వు మమ్మల్ని కాలుస్తావా?’)

ఇదిలా ఉండగా.. జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యపై ఆందోళనలు మిన్నంటుతున్న తరుణంలో వారికి మద్దతు తెలిపిన ఒట్టావా పోలీసులు.. తాము తమ పౌరుల హక్కులను కాపాడతామంటూ ప్రకటన విడుదల చేశారు.  ‘‘ప్రజలకు భద్రత కల్పించడమే మా పని. మా ప్రజలు, కమ్యూనిటీ సభ్యుల హక్కులను గౌరవిస్తాం. అన్యాయాలను ఎదురించేందుకు వారు గళమెత్తిన సమయంలో సంయమనంతో వ్యవహరిస్తాం. వారి ఆవేదన, విసుగును మేం అర్థం చేసుకోగలం’’అని పేర్కొన్నారు. కాగా అమెరికాలోని మినియాపోలిస్‌లో ఓ పోలీస్‌ అధికారి ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మెడపై కాలితో నొక్కిపెట్టడంతో ఊపిరాడక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జాత్యహంకార దాడిని నిరసిస్తూ అగ్రరాజ్యంలో నిరసనలు భగ్గుమంటున్నాయి.(జార్జ్‌ ఒక నేరస్థుడు.. రెండో వైపు కూడా చూడండి)

మరిన్ని వార్తలు