ప్రధాని వేషంతో.. పరేషాన్‌..!!

24 Feb, 2018 20:08 IST|Sakshi

న్యూఢిల్లీ:  దుమారం రేగుతోంది.  కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో విమర్శల పాలవుతున్నారు.  వారం రోజుల పాటు ఇండియాలో పర్యటించేందుకు ఫిబ్రవరి 17న వచ్చిన ట్రూడో సంప్రదాయానికి భిన్నంగా కాషాయ వస్త్రాలతో కూడిన బాలీవుడ్‌ వేషధారణలో తిరగడంతో ఈ విమర్శల పరంపర ప్రారంభమైంది. దీనిపై నెటిజన్లు, మీడియా కెనడియన్‌ ప్రధానిపై మండిపడుతున్నారు.

జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా దీనిపై స్పందిసూ​..''ఇంతలా నటించాల్సిన అవసరం లేదు. ట్రూడో వ్యవహారం ఆక్షేపనీయంగా ఉంది. మీలా మేము రోజూ అంత ఆహార్యంగా బట్టలు ధరించలేము.  బాలీవుడ్‌లో కూడా అలాంటి వస్త్రాలు వేసుకోరు'' అంటూ ట్వీట్‌ చేశారు.  ట్రూడో చేతులు జోడించి ప్రజలకు దండాలు పెడుతున్న ఫోటోలను కూడా పోస్ట్‌ చేశారు.

విమర్శలకు బదులిస్తూ.. ట్రూడో తనకు సంప్రదాయ దుస్తుల అంటే అమితమైన ఇష్టమని తెలిపారు.  ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత తాను సూట్‌ వేసుకోలేదనా?  లేదా సంప్రదాయ దుస్తులు ఎందుకు వేసుకున్నాననా?  తేల్చుకోవాలన్నారు. 

చేతులకు గోరింటాకు పెట్టుకో.. 
ఓ ట్వీ్‌టర్‌ ఖాతాదారుడు 90వ దశకంలో వచ్చిన బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ మూవీ 'దిల్‌వాలే దుల్హానియా లేజాయెంగే' చిత్రంలోని సందర్భాన్ని గుర్తుచేస్తూ చేతులకు గోరింటాకు పెట్టుకో..  అని ట్రూడోను గేలీ చేశాడు.  

ట్రూడో సినిమా ఆడిషన్స్‌కి వచ్చినట్టున్నాడు..
హాస్యనటుడు ట్రెవర్‌ నొహ ట్రూడోని ఉద్దేశించి..కెనడా ప్రధాని ఆస్కార్‌ పురస్కార చిత్రం 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్' లోని జయహో పాట ఆడిషన్స్‌కి వచ్చినట్టున్నారని జోక్‌ పేల్చారు.

కాగా వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక ట్రూడో చేస్తున్న ఇండియా పర్యటనను 'విపత్తుని కొని తెచ్చే సందర్శన' అంటూ వ్యాఖ్యానించింది.  స్వేచ్ఛావహ వాతావరణం గల దేశానికి అధినేత, స్త్రీవాది, సినిమా హీరోని పోలిన రూపం, ప్రజల పక్షపాతి అన్న పేరున్న జస్టిన్‌​ ట్రూడో వ్యవహారం చూసి అందరూ నివ్వెర పోయారని తెలిపింది.  ట్రూడో తన వారం రోజుల ఇండియా పర్యటనను ఏ మాత్రం ప్రయోజనం లేకుండా నిరాశతో నింపేశారని చురకలంటించింది.
 

మరిన్ని వార్తలు