అమ్మ ఇప్పుడు బాగానే ఉన్నారు: ట్రూడో

29 Apr, 2020 09:59 IST|Sakshi

ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తల్లి మార్గరెట్‌ ట్రూడో నివసిస్తున్న అపార్టుమెంటులో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అత్యవసర సేవల విభాగం సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్థానిక మీడియా షేర్‌ చేసింది. ఈ ఘటనలో మార్గరెట్‌ గాయాలపాలైనట్లు పేర్కొంది. అదే విధంగా తీవ్రంగా అలుముకున్న పొగ కారణంగా ఆమె శ్వాస తీసుకోలేకపోతున్నారని.. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించింది. ఆమె కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా నుంచి కోలుకున్న కెనడా ప్రధాని భార్య)

ఇక ఈ విషయంపై ప్రధాని జస్టిన్‌ ట్రూడో ట్విటర్‌ వేదికగా స్పందించారు. తన తల్లి మార్గరెట్‌తో మాట్లాడానని.. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. తమ కోసం ప్రార్థించిన వారందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదం గురించి తెలియగానే వెంటనే స్పందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అదే విధంగా అపార్టుమెంటులోని ఇతర కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు. కాగా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తల్లి, దివంతగ ప్రధాని పిర్రే ట్రూడో సతీమణి అయిన మార్గరెట్‌ రేడియో కెనడాలో పనిచేశారు. ప్రస్తుతం ఆమె డౌన్‌టౌన్‌ రెసిడెన్స్‌లో నివసిస్తున్నారు. తొలుత ఐదో అంతస్తులో అంటుకున్న మంటలు.. అపార్టుమెంటు మొత్తం వ్యాపించాయి. 70 మంది ఫైర్‌ఫైటర్లు రంగంలోకి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు