ముగ్గురికి వైద్య నోబెల్‌

8 Oct, 2019 04:25 IST|Sakshi
గ్రెగ్‌ సెమెన్జా, విలియం కెలీన్‌, పీటర్‌ రాట్‌క్లిఫ్‌

కణాల్లో ఆక్సిజన్‌ స్థాయిలపై పరిశోధనలకుగాను ప్రకటించిన నోబెల్‌ కమిటీ

స్టాక్‌హోమ్‌: వైద్య రంగంలో 2019 సంవత్సరానికి గానూ ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం ఇద్దరు అమెరికన్‌ సైంటిస్టులు, ఒక బ్రిటిష్‌ శాస్త్రవేత్తను వరించింది. అమెరికాకు చెందిన డాక్టర్‌ విలియమ్‌ జీ కెలీన్‌ జూనియర్‌(హార్వర్డ్‌ యూనివర్సిటీ), డాక్టర్‌ గ్రెగ్‌ ఎల్‌ సెమెన్జా(హాప్కిన్స్‌ యూనివర్సిటీ), బ్రిటన్‌కు చెందిన డాక్టర్‌ పీటర్‌ జే రాట్‌క్లిఫ్‌(ఫ్రాన్సిస్‌ క్రిక్‌ ఇన్‌స్టిట్యూట్‌)లను ఈ పురస్కారానికి నోబెల్‌ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. ఈ ముగ్గురు ప్రైజ్‌మనీ అయిన 9.18 (రూ. 6.51 కోట్లు)లక్షల అమెరికన్‌ డాలర్లను సమంగా పంచుకుంటారు.

శరీరంలోని కణాలు శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయిలను ఎలా గుర్తిస్తాయో, ఆ స్థాయిలకు అనుగుణంగా తమ పనితీరును ఎలా మార్చుకుంటాయో అనే విషయంపై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. రక్తహీనత, కేన్సర్‌ తదితర వ్యాధుల చికిత్సలో ఈ పరిశోధనలు ఉపయోగపడ్తాయని నోబెల్‌ కమిటీ పేర్కొంది. ‘వేర్వేరు ఆక్సిజన్‌ స్థాయిలకు జన్యువులు ఎలా ప్రతిస్పందిస్తాయనే విషయంలో, అలాగే, కొత్త ఎర్ర రక్త కణాలు, రక్త నాళాల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తిని మెరుగుపర్చే విషయాల్లో వీరు చేసిన పరిశోధనలు ఆ శాస్త్ర విస్తృతికి ఎంతో దోహదపడ్డాయి’ అని కమిటీ ప్రశంసించింది. ఆక్సిజన్‌ను గ్రహించే విధానంలో మార్పు కలగజేసే ఔషధాల రూపకల్పన ద్వారా పలు వ్యాధులకు చికిత్స విధానాన్ని వీరు రూపొందించారు.

ఈ అవార్డ్‌ ద్వారా తనకొచ్చిన డబ్బును ఎలా వినియోగించాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని, అయితే, ఒక మంచి పనికే ఆ డబ్బును వాడుతానని డాక్టర్‌ కెలీన్‌ తెలిపారు. ‘ఉదయం 5 గంటల సమయంలో సగం నిద్రలో ఉండగా ఈ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈ సమయంలో ఫోన్‌ వచ్చింది అంటే.. అది శుభవార్తే అయ్యుండొచ్చు అనుకున్నాను. నా గుండె వేగం పెరిగింది’ అని వ్యాఖ్యానించారు.  ‘ఈ పరిశోధన ప్రారంభించేముందు అవార్డుల గురించి ఆలోచించలేదు. కణాల్లో ఆక్సిజన్‌ స్థాయిలపై పరిశోధన అంత సులభం కాదు. పరిశోధన ఫలితాలపై కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు’  అని డాక్టర్‌ రాట్‌క్లిఫ్‌ స్పందించారు. 2018 సంవత్సరానికి గానూ అమెరికా సైంటిస్ట్‌ జేమ్స్‌ ఆలిసన్, జపాన్‌ శాస్త్రవేత్త తసుకు హోంజోలకు వైద్య శాస్త్ర నోబెల్‌ లభించింది. డైనమైట్‌ను రూపొందించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరున ఇచ్చే ఈ పురస్కారాలను, ప్రతీ సంవత్సరం ఆయన వర్థంతి రోజైన డిసెంబర్‌ 10న ప్రదానం చేస్తారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా