మిస్‌ యూ: మీరేం బాధపడకండి ట్రంప్‌!

4 Dec, 2019 12:18 IST|Sakshi

వాషింగ్టన్‌ : అగ్రరాజ్య అధ్యక్ష పదవికి 2020లో జరుగనున్న ఎన్నికల పోటీ నుంచి నిష్క్రమిస్తూ డెమొక్రటిక్‌ పార్టీ సభ్యురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌‌(54) తీసుకున్న నిర్ణయం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ‘ అయ్యో పాపం. మిమ్మల్ని మిస్సవుతాం కమలా!’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ఇందుకు వెంటనే బదులిచ్చిన కమలా హ్యారిస్‌.. ‘ అంతగా బాధ పడకండి మిస్టర్‌ ప్రెసిడెంట్‌. మిమ్మల్ని విచారణలో కలుస్తాను’ అంటూ ట్రంప్‌ అభిశంసన తీర్మానం గురించి ప్రస్తావిస్తూ ఘాటు కౌంటర్‌ ఇచ్చారు. కాగా డొనాల్డ్‌ ట్రంప్‌ను అధ్యక్ష పీఠం నుంచి తొలగించేలా అభిశంసన ప్రక్రియ చేపట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అధికార రిపబ్లికన్ల కంటే ప్రతిపక్ష డెమోక్రాట్లదే పైచేయిగా ఉన్న ప్రతినిధుల సభలో గురువారం 232-196 ఓట్ల తేడాతో తీర్మానం నెగ్గింది. తన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ.. నిధుల మంజూరును సాకుగా చూపి ఉక్రెయిన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని ట్రంప్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై బహిరంగ విచారణ జరిపించి, అధ్యక్షుడిని అభిశంసించాలని ప్రతిపక్షం పట్టుబడుతోంది. (చదవండి : నా దగ్గర డబ్బు లేదు.. అందుకే: కమలా హ్యారిస్‌)

ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి తన వద్ద కావాల్సినంత డబ్బు లేదని పేర్కొంటూ డెమొక్రటిక్‌ సభ్యురాలు, కాలిఫోర్నియా సెనెటర్‌ కమలా హ్యారిస్‌ ఎన్నికల బరి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. డెమొక్రటిక్‌ పార్టీలో కీలక నేతగా ఉన్న కమల.. అధ్యక్షుడు ట్రంప్‌ విధానాలను విమర్శిస్తూ పతాక శీర్షికల్లో నిలిచారు. ఆఫ్రికన్‌- ఆసియా(భారత్‌) మిశ్రమ సంతతికి చెందిన కమలను తోటి సభ్యులు ఫిమేల్‌ ఒబామాగా అభివర్ణిస్తారు. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి పోటీ పడనున్నట్లు ప్రకటించి... ఈ ఏడాది ప్రారంభంలో ఘనంగా ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్య అధ్యక్ష పదవిని అలంకరించే తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తారంటూ కమల మద్దతుదారులు ఆశించారు. అయితే ఆదాయ వనరుల కారణంగా కమల అధ్యక్ష పదవి నుంచి నిష్క్రమించడంతో వారు నిరాశలో మునిగిపోయారు. కాగా పార్టీలోని ఇతర సభ్యులతో పోలిస్తే కమల.. 3.5 శాతం ఓట్లు మాత్రమే సంపాదించి ఆరో స్థానానికి పడిపోవడంతో ఈ మేరకు ప్రకటన చేశారు.

మరిన్ని వార్తలు