పాము తలపై రెండు కిక్‌లు.. అంతే..!

30 Mar, 2019 12:10 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా ఎడారుల్లో అత్యంత విషపూరితమైన రాటిల్‌స్నేక్‌ దాడుల నుంచి ప్రాణాలు నిలుపుకొంటున్న కంగారూ ర్యాట్‌ వ్యూహాలేమిటో తెలిసిపోయాయి. రాటిల్‌స్నేక్‌ నోటికి చిక్కినా కూడా సరికొత్త వ్యూహాలతో తప్పించుకుంటున్న ఈ ఎలుకల చాకచక్యాన్ని చూసి జంతు శాస్త్రవేత్తలే ఆశ్యర్యపోయారు. సెకన్లో ఏడో వంతు వేగంతో పాము తలపై ఎగిరి తంతున్న కంగారూ ర్యాట్‌ వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అధునాతన కెమెరాలు, పరికరాలతో అరిజోనా ఎడారిలో శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేపట్టారు.

అంతెత్తున ఎగిరి..
శాస్త్రవేత్త ఫ్రేమిలర్‌ ప్రకారం.. ఇసుకలో కూడా అతి వేగంగా కదిలే అత్యంత ప్రమాదకరమైన సర్పం రాటిల్‌స్నేక్‌. అయినా, వాటికి ఆహారం కాకుండా ఎస్కేప్‌ అవుతున్న కంగారూ ర్యాట్‌ ఆత్మరక్షణా యుక్తులు అద్భుతం. అందరూ అనుకుంటున్నట్టుగా ఇవి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడటం లేదు. విస్మయపరిచే వ్యూహాలతో పాములకే సవాల్‌ విసురుతున్నాయి. తాజా వీడియోలో.. ఎలుకను విందు చేసుకుందామనుకున్న రాటిల్‌స్నేక్‌ దానిమీదకి ఒక్క ఉదుటున దుమికింది. నోట కరుచుకున్నంత పని చేసింది.  అయితే, పాముకన్నా వేగంగా స్పందించిన ఎలుక అంతెత్తున గాల్లోకి ఎగిరింది. పాము నోట్లో చిక్కుకుంది అనుకునే సమయంలో నింజాఫైట్‌ చేసింది. దాని తలపై రెండు కాళ్లతో కిక్‌ చేసింది. మళ్లీ గాల్లోనే గింగిరాలు తిరుగుతూ.. పాముకు అందకుండా దూరంగా పారిపోయింది.

ఆ పరిస్థితుల్లో వేరే జాతికి చెందిన ఎలుకలుంటే వాటికి చావు తథ్యం అయ్యేదే. మామూలుగా అయితే, రాటిల్‌స్నేక్‌ చాలా వేగంగా దెబ్బకొడతాయి. కానీ, కంగారూ ర్యాట్స్‌ మరింత వేగంగా స్పందింస్తాయి. ఈ ఎలుకలు పరుగెత్తడానికి వీలు లేనప్పుడు నింజాఫైట్‌ ట్రిక్కులతో బయటపడతాయి. అయితే, పాము విషం చిమ్మితే ఎలుక ప్రాణాలు ఉంటాయా అనే ఒక సందేహం కలుగుతోంది కదా.. వేగంగా స్పందించినప్పుడు సరిపడినంత విషం పాము కోరల్లోకి రాదు. ఆ క్రమంలో కంగారూ ర్యాట్స్‌ ఫైట్‌ చేసి తప్పించుకుంటాయి. ఎలుకలు 30 నుంచి 70 మిల్లీ సెకన్లపాటు పాము నోట్లో ఉన్నా కూడా వాటికి విషం చేరదు. అంటే మనిషి కనురెప్పపాటు కాలం (150 మిల్లీ సెకండ్లు) కన్నా తక్కువ సమయంలో ఎలుక యుద్ధం చేసి విజయం సాధిస్తుందన్నమాట..!

మరిన్ని వార్తలు