ఈ పిల్లి ఆస్తి విలువ 14 వేల కోట్లు!?

21 Feb, 2019 08:41 IST|Sakshi

పిల్లులందు ఈ పిల్లి వేరయా! అని అనక తప్పదు. ఎందుకంటే పై ఫోటోలో కనిపిస్తున్న పిల్లి ప్రపంచంలోనే అత్యంత ధనికురాలట. జర్మనీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ కార్ల్‌ లాగర్‌ఫెల్డ్‌(85) బర్మీస్‌ జాతికి చెందిన పిల్లిని అపురూపంగా పెంచుకున్నాడు. ఈ పిల్లికి షౌపెట్‌ అని నామకరణం చేసి.. రాజ భోగాలు అందించారు. 2011లో తన స్నేహితుడి దగ్గరి నుంచి ఇష్టపడి తెచ్చుకుని ఈ మార్జాలనికి ఓ బాడీగార్డును, పనివాళ్లను కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పటికే ఈ పిల్లి పలు కాస్మోటిక్‌ బ్రాండ్స్‌ ప్రకటనల్లో, కారు ప్రకటనల్లో కనిపించింది. మోడళ్లు ఫోటోలకు పోజులివ్వడానికి కూడా షౌపెట్‌ను వాడేవారు. అంతేకాకుండా షౌపెట్‌పై ప్రేమతో ‘షౌపెట్‌: ది ప్రైవేట్‌ లైఫ్‌ ఆఫ్‌ ఎ హై ఫ్లైయింగ్‌ ఫ్యాషన్‌ క్యాట్‌’అనే పుస్తకాన్ని కూడా కార్ల్‌ రాశాడు. అందుకే కార్ల్‌ అనేకమార్లు షౌపెట్‌ ధనికురాలంటూ సంబోధించేవాడు.

ఇక షౌపెట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకు పైగా ఫాలోవర్స్‌ ఉండటం విశేషం. కార్ల్‌ కూడా దానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో  పిల్లిగారికి సోషల్‌ మీడియాలో తెగ క్రేజ్‌ ఏర్పడింది. అన్నీ సజావుగా జరుగుతున్న సమయంలో కార్ల్‌ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అద్భుతమైన ఫ్యాషన్‌ డిజైనర్‌ను కోల్పోయామని నెటిజన్లు ట్వీట్లు చేశారు. కాగా మరణానికి ముందే కార్ల్‌ తనకు ఎంతో ఇష్టమైన పిల్లి బాగోగుల గురించి ఆలోచించారు. తన మొత్తం ఆస్తిని రాసిస్తున్నట్లు గతంలోనే పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆయన సంపాదించిన ఆస్తిలో 150 మిలియన్‌ పౌండ్లు(సుమారు రూ.14వేల కోట్లు) ఇప్పుడు ఈ పిల్లికి దక్కనున్నట్లు సమాచారం. మార్జాలమా మజాకానా మరి.   

మరిన్ని వార్తలు