సాయం.. కఠ్మాండు లోయకే పరిమితం!

1 May, 2015 02:19 IST|Sakshi
సాయం.. కఠ్మాండు లోయకే పరిమితం!

 ఇంకా మారుమూల ప్రాంతాలకు చేరని సహాయ బృందాలు
 నేపాల్ భూకంప బాధితుల్లో ఆగ్రహావేశాలు
 భక్తపూర్‌లో నాలుగు నెలల చిన్నారిని రక్షించిన రక్షక దళాలు

 
 
కఠ్మాండు: నేపాల్‌లో సహాయ, రక్షక చర్యలు కఠ్మాండు లోయకే పరిమితమయ్యాయి. భూకంప తీవ్రత భారీగా ఉన్న గోర్ఖా, ధాడింగ్, సింధుపల్‌చౌక్, కావ్రె, నువాకోట్ జిల్లాల్లో, ముఖ్యంగా మారుమూల పర్వత పాద ప్రాంతాల్లో సాయం కోసం బాధితుల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. భారీ వర్షం, విరిగిపడ్తున్న కొండచరియలు, భూకంపం ధాటికి దెబ్బతిన్న రహదారుల కారణంగా సహాయ బృందాలు ఆ ప్రాంతాలకు చేరలేకపోతున్నాయి.

వర్షం వల్ల హెలీకాప్టర్లు సహాయ చర్యల్లో పాలుపంచుకోలేకపోతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడే నిపుణులు, యంత్ర సామగ్రి కొరత కూడా భారీగా కనిపిస్తోంది. ఇప్పటికీ బాధితులందరికీ అవసరమైన సాయం అందించలేకపోతున్నామని నేపాల్ సమాచార శాఖ మంత్రి మినేంద్ర రిజల్ పేర్కొనడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడ్తోంది. భూవిలయంతో సర్వం కోల్పోయి రోడ్డున పడి దాదాపు 5 రోజులవుతున్నా ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఆహారం, తాగునీరు, పాలు మొదలైన నిత్యావసరాలను కూడా అందించలేకపోతోందని మండిపడ్తున్నారు. పలు ప్రాంతాల్లో సహాయ సామగ్రిని, ఆహర పదార్థాలను తీసుకెళ్తున్న వాహనాలపై దాడులు చేసి,  నిత్యావసరాలు తీసుకెళ్లిపోతున్నారు. పాకిస్తాన్.. నేపాల్‌కు పశుమాసం ఉన్న ఆహార పదార్థాలు పంపడంతో వివాదం రేగింది. ఆ ఆహారాన్ని తీసుకోవడానికి బాధితులు నిరాకరించారు. భూకంప మృతుల సంఖ్య 10 వేల నుంచి 15 వేల దాకా ఉండొచ్చని నేపాల్ సైనిక దళాల ప్రధానాధికారి గౌరవ్ రాణా పేర్కొన్నారు.


మృత్యుంజయులు: శిథిలాల తొలగింపు సందర్భంగా ప్రాణాలతో బయటపడ్తున్న మృత్యుంజయుల సంఖ్య పెరుగుతోంది. గురువారం 15 ఏళ్ల బాలుడు పెంబ లామాను నువాకోట్ ప్రాంతంలో సహాయ దళాలు కొన్ని గంటల పాటు శ్రమించి రక్షించాయి. భారత్ నుంచి వైమానిక దళ విమానాల్లో ఇప్పటివరకు 314. 6 టన్నుల సహాయ సామగ్రిని నేపాల్‌కు తరలించారు.  ఇక ఎవరెస్ట్ పర్వత శిఖరం దగ్గరలో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో చనిపోయిన 19 మందిలో 15 మందిని అధికారులు గుర్తించారు.

మరిన్ని వార్తలు