భారత్‌ ఆశలు గల్లంతు!

18 Oct, 2017 10:20 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వ హోదా భారత్‌కు ఇప్పట్లో దక్కనట్లు స్పష్టమైంది. ఐక్యరాజ్యసమితికి అమెరికా తరుపున రాయబారిగా వ్యవహరిస్తున్న నిక్కీ హేలి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. వీటో అధికారం జోలికి ఎవరినీ రానివ్వకూడదనే శాశ్వత సభ్యత్వ దేశాల వైఖరే భారత్‌కు శాశ్వత హోదాకు కీలక అంశంగా మారిందని హేలి అన్నారు. వాషింగ్టన్‌లో నిర్వహించిన భారత్‌ అమెరికా ఫ్రెండ్‌షిప్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు.

'భద్రతా మండలి నిర్మాణంలో సంస్కరణలో వీటో అధికారం ప్రధానంగా మారింది. ఇప్పటికే శాశ్వత సభ్యత్వ దేశాలైన రష్యా, చైనా, బ్రిటన్‌ అమెరికా, ఫ్రాన్స్‌ దేశాల్లో ఏ దేశం కూడా వీటో వేరే దేశం జోక్యాన్ని ఆహ్వానించడం లేదు. ముఖ్యంగా రష్యా, చైనా దేశాలు భద్రతా మండలి నిర్మాణంలో సంస్కరణను వ్యతిరేకిస్తున్నట్లు నేను గుర్తించాను. అందుకే భారత్‌ శాశ్వత హోదాకు ఇప్పుడు వీటో గురించే కీలకంగా మారింది' అని హేలి చెప్పారు. తాము భారత్‌కు అనుకూలంగానే ఉన్నప్పటికీ అమెరికా కాంగ్రెస్‌కు గానీ, సెనేట్‌కుగానీ భద్రతా మండలిని సంస్కరించే పూర్తి అధికారులు లేవని ఆమె చెప్పారు. 'ఇది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన విషయం. ఐక్యరాజ్యసమితికి చెంది భద్రతామండలిలోని సంస్కరణ అంశం. ఇందులో మార్పు తీసుకురావాలని భారత్‌ బలంగా కోరుకుంటే మరిన్ని దేశాల మద్దతు తీసుకొచ్చుకోవడం ద్వారా అది సాధ్యం అవుతుందని నేను అనుకుంటున్నాను' అని హేలి చెప్పారు.

మరిన్ని వార్తలు