వీడిన ఖషోగ్గీ హత్య మిస్టరీ

21 Oct, 2018 01:56 IST|Sakshi

తమ ఎంబసీలోనే చనిపోయాడని ఎట్టకేలకు ఒప్పుకున్న సౌదీ

రియాద్‌: ఇస్తాంబుల్‌లోని తమ రాయబార కార్యాలయంలోనే జమాల్‌ ఖషోగ్గీ చనిపోయాడని సౌదీ అరేబియా ఎట్టకేలకు శనివారం ఒప్పుకుంది. సౌదీ జాతీయుడైన ఖషోగ్గీ అమెరికాలో ఉంటూ సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ను, ఆయన విధానాలను  విమర్శిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. ఈ నెల 2న తన వ్యక్తిగత పనిపై ఖషోగ్గీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలోకి వెళ్లి బయటకురాలేదు. ఖషోగ్గీని ఎంబసీలోనే చంపేశారని టర్కీ ఆరోపించింది. అదే నిజమైతే సౌదీని శిక్షిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ఖషోగ్గీ ఏమయ్యాడో తమకూ తెలీదని సౌదీ ఇన్నాళ్లూ బుకాయించింది.

అంతర్జాతీయసమాజం నుంచి ఒత్తిడి, టర్కీ దర్యాప్తు నేపథ్యంలో తమ కార్యాలయంలోనే ఖషోగ్గీ చనిపోయాడని ఎట్టకేలకు సౌదీ ఒప్పుకుంది. ఎంబసీలో ఖషోగ్గీని ప్రశ్నిస్తున్నపుడు అధికారులకు, ఖషోగ్గీకి గొడవ జరిగిందనీ, ఆ గొడవలోనే మరణించాడని సౌదీ అటార్నీ జనరల్‌ చెప్పారు. కాగా, మృతదేహం జాడను బయటపెట్టలేదు. ఖషోగ్గీ హత్య విషయమై నిఘా విభాగం ఉప ప్రధానాధికారి అహ్మద్‌ అల్‌–అస్సీరి, మీడియా సలహాదారు సౌద్‌ అల్‌–కహ్తానీలను విధుల నుంచి సౌదీ తప్పించింది. వీరిద్దరూ యువరాజుకు సన్నిహితులు.

18 మంది సౌదీ జాతీయులను అదుపులోకి తీసుకుంది. ‘సౌదీ వివరణను నేను నమ్ముతున్నా. 18 మందిని అదుపులోకి తీసుకోవడం విచారణలో తొలి, గొప్ప ముందుడుగు’ అని ట్రంప్‌ అన్నారు. ఖషోగ్గీ మరణం తమకు విచారం కలిగిస్తోందని అమెరికా అధ్యక్షభవనం అధికారిక ప్రతినిధి సారా శాండర్స్‌ పేర్కొన్నారు. అయితే సౌదీపై ఆంక్షలు విధించే అంశాన్ని అమెరికా అసలు ప్రస్తావించలేదు. భవిష్యత్తులో సౌదీపై ఆంక్షలేమైనా ఉండొచ్చని సమాచారం. 

మరిన్ని వార్తలు