32 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకి..

19 May, 2020 16:23 IST|Sakshi

బీజింగ్‌ : చిన్నప్పుడు కిడ్నాప్‌కి గురైన వ్యక్తి చివరకు 32 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యులను చేరుకోగలిగాడు. 1988లో రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు మావో ఇన్‌ అపహరణకు గురయ్యాడు. షాంగ్జీ ప్రావిన్స్‌లో గ్జియాన్‌లోని తమ నర్సరీ నుంచి ఇంటికి వెళుతుండగా, కుమారుడికి నీళ్లు తీసుకురావడానికి వెళ్లినప్పుడు కొందరు దుండగులు బాబును అపహరించారు. అప్పటి నుంచి తన కుమారుడి జాడ తెలిస్తే చెప్పాలని మావో ఇన్‌ తల్లిదం‍డ్రులు కనిపించిన ప్రతి ఒక్కరినీ విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. గ్జియాన్‌ నగరంలో దాదాపు ప్రతి ఇంటికి వెళ్లి తమ బాబు కనిపించాడా అని అడిగారు. పోస్టర్‌లు అంటించారు. చివరకు తమ బాబు దొరకడేమనని నిరాశతో కుంగిపోయారు. మావో ఇన్‌ తల్లి లీ జింగ్జీ తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి 10 ప్రావిన్స్‌లలోని అన్ని మున్సిపాలిటీలలో లక్షకుపైగా పాంప్లెట్లను పంచిపెట్టారు. 

ఎన్నో ఏళ్లుగా కొన్ని వందల టెలివిజన్‌ కార్యక్రమాల్లో తన కుమారుడి సమాచారం తెలిస్తే చెప్పాల్సిందిగా వేడుకున్నారు. తమ కుమారుడి పోలీకలకు దగ్గరగా ఉండి, అదే సమయంలో అపహరణకు గురైన దాదాపు 300 మందిని ఆమె కలుసుకున్నారు. కానీ, వారిలో ఒక్కరు కూడా తమ కుమారుడు కాదని డీఎన్‌ఏ పరీక్షల్లో తేలింది.
 
ఇక చివరకు, తప్పిపోయినా, లేదా అపహరణకు గురైన చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చేలా సహాయపడాలని నిశ్చయించుకున్నారు. 2007లో ‘బేబీ కమ్‌ బ్యాక్‌ హోమ్‌’ పేరుతో వాలింటరీ గ్రూపును ప్రారంభించారు. ఇప్పటి వరకు మొత్తం 29 మంది చిన్నారులు తమ కుటుంబ సభ్యుల చెంతకు చేరేలా లీ జింగ్జీ కృషి చేశారు.

గత ఏప్రిల్‌లో సిచువాన్‌ ప్రావిన్సులో ఓ వ్యక్తి నుంచి తమకు టిప్‌ అందిందని పోలీసులు తెలిపారు. ఏళ్ల కిందట తాము బాలుడిని దత్తత తీసుకున్నామని సదరు వ్యక్తి తెలిపాడు. దీంతో పోలీసులు దత్తత తీసుకున్న 34 ఏళ్ల మావో ఇన్‌ని గుర్తించి డీఎన్‌ఏ టెస్ట్‌ నిర్వహించారు. అప్పటికే తమ వద్ద ఉన్న లీ జింగ్జీ డీఎన్‌ఏతో మావో ఇన్‌ డీఎన్‌ఏ మ్యాచ్‌ అయింది. మావో ఇన్‌, ప్రస్తుత పేరు గూ నింగింగ్‌.  డెకరేషన్‌ వ్యాపారం చేస్తున్నాడు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలని ఉందని తెలిపాడు. 

మావో ఇన్‌ని దుండగులు అపహరించి, పిల్లలు లేని తల్లిదం‍డ్రులకి దాదాపు 60వేల రూపాయలకు అమ్మేశారని పోలీసులు తెలిపారు. మావో ఇన్‌ ఆచూకీ లభించిన విషయాన్ని సరిగ్గా మాతృదినోత్సవమైన 10 మేన లీ జింగ్జీకి పోలీసులు ఈ విషయాన్ని చెప్పారు. నా జీవితంలో నాకు దొరికిన బెస్ట్‌ గిఫ్ట్‌ ఇదే అని లీ జిం‍గ్జీ కన్నీటి పర్యంతమయ్యారు. మావో ఇన్‌ చేతిని గట్టిగా పట్టుకుని నా కుమారుడిని ఇక వదిలి ఉండలేను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.  నాకుమారుడిని తిరిగి కలుసుకోవడానికి సహకరించిన ఎన్నో వేలమందికి నేను రుణపడి ఉంటాను అని లీ జింగ్జీ అన్నారు.

చైనాలో దశాబ్ధాలుగా చిన్న పిల్లల అపహరణ సమస్య కొనసాగుతోంది. ప్రతి ఏడాది దాదాపు 20వేల మందికిపైగా చిన్నారులు అపహరణకు గురి అవుతున్నారు. చైనాలో పబ్లిక్‌ సెక్యురిటీ మంత్రిత్వ శాఖ 2009లో డీఎన్‌ఏ డేటాబేస్‌ను సేకరించడం ప్రారంభించింది. దీని వల్ల ఇప్పటి వరకు 6000 మంది అపహరణకు గురైన చిన్నారులను గుర్తించారు. ఇక 2016 మేలో చైనా ప్రభుత్వం రీ యూనియన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. 2019 జూన్‌ వరకు ఈ కార్యక్రమం వల్ల 4వేలకు పైగా చిన్నారులు తమ తల్లిదండ్రుల చెంతకు చేరారు.

మరిన్ని వార్తలు