కేన్సర్‌ కణాలను చంపేసే స్విచ్‌!

26 Oct, 2017 01:32 IST|Sakshi

కేన్సర్‌పై పోరులో శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకు వేశారు. కేన్సర్‌ కణాలు తమంతట తామే చనిపోయేలా చేయగల జన్యుస్థాయి వ్యవస్థను శాస్త్రవేత్తలు గుర్తించారు. కేన్సర్‌ లాంటి వ్యాధులు వస్తే మనిషి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుందని మనకు తెలుసు. అయితే కేన్సర్‌ కణాలను గుర్తించడం ఆలస్యమైతే.. లేదా ఈ కణాలు రోగ నిరోధక వ్యవస్థ దృష్టిని తప్పించుకునేలా రూపాంతరం చెందితే సమస్య జటిలమవుతుంది. రోగనిరోధక వ్యవస్థ లేనప్పుడు జీవజాతులు కేన్సర్‌ను ఎలా ఎదుర్కొనేవి అన్న ఆసక్తికరమైన ప్రశ్నతో నార్త్‌వెస్టర్న్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.

జీవజాతులు ఇప్పటివరకూ మనగలిగాయంటే వీటిల్లో ఏదో ఒక వ్యవస్థ కేన్సర్‌ను దూరంగా పెట్టిందని.. పరిణామ క్రమంలో ఇది పనిచేయకుండా పోయి ఉంటుందన్న వీరి అంచనా నిజమని తెలిసింది. మానవ జన్యుక్రమంలో అక్కడక్కడా ఉండే కొన్ని చిన్న భాగాలను కణాల్లోకి జొప్పిస్తే అవి ఆయా జన్యువుల పనితీరును ప్రభావితం చేస్తాయని గుర్తించినట్లు తెలిపారు. కేన్సర్‌ కణాలు మనగలిగేందుకు కీలకమైన మూడు జన్యువులు లక్ష్యంగా డీఎన్‌ఏ భాగంతో ప్రయోగాలు చేశామని మార్కస్‌ పీటర్‌ తెలిపారు.

సుమారు 50 కోట్ల ఏళ్ల కింద ఇలాంటి వ్యవస్థ ఒకటి పనిచేయడం వల్ల కేన్సర్‌ నుంచి జీవులు తప్పించుకున్నట్లు అంచనా వేశారు. గర్భాశయ కేన్సర్‌ కలిగిన ఎలుకలపై తాము ఈ వ్యవస్థను ఉపయోగించి చూశామని, దుష్ప్రభావాలు అనేవి లేకుండా కణితి పెరుగుదల గణనీయంగా తగ్గిందని వివరించారు. దాదాపు అన్ని రకాల కేన్సర్లకు మెరుగైన చికిత్స కల్పించగల ఈ సరికొత్త వ్యవస్థను మరింత సమర్థంగా మార్చేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు