కిమ్‌ గుర్రపు స్వారీ, కొత్త​ ఆపరేషన్‌ కోసమేనా?

16 Oct, 2019 12:53 IST|Sakshi

సియోల్‌ : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కొత్త ఆపరేషన్‌కు తెర తీసినట్లు కొరియన్‌ వార్తాసంస్త బుధవారం వెల్లడించింది. కొరియాలోని అత్యంత ప్రమాదకర పర్వతమైన 'మౌంట్‌ పయేక్టు'లో కిమ్‌ సాహోసోపేతమైన గుర్రపు స్వారీ చేశారు. మంచుతో కప్పబడిన పయేక్టు ప్రాంతంలో కిమ్‌ తెల్లటి గుర్రంపై షికారు చేసిన ఫోటోలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా కిమ్‌ వంశస్తులు ఈ పర్వతాన్ని ఎంతో ఆధ్యాత్మికమైన ప్రదేశంగా చూస్తారు. ప్రమాదకరమైన పర్వతంగా పేరు పొందిన పయేక్టులో కిమ్‌ ధైర్యంగా గుర్రపు స్వారీనీ ఆస్వాదించినట్లు ఆయన సహాయకులు తెలిపారు.

ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కిమ్‌ ఇలాంటి సాహసయాత్రలు చేస్తారని సహాయకులు తెలిపారు. గతంలో అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షించడానికి ముందు కిమ్‌ పయేక్టు పర్వతాన్ని సందర్శించారు. 2018లో దక్షిణ కొరియాతో జరిగిన చారిత్రక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు మూన్‌-జే-ఇన్‌ను పయేక్టు పర్వత శిఖరానికి తీసుకెళ్లారు. మరి ఈసారి కిమ్‌ దేనిపై ప్రకటన చేస్తారో అనేది తెలియాల్సి ఉంది. ప్రపంచ దేశాలు ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ధైర్యంగా నిలబడాలనే ఉద్దేశంలో అధ్యక్షుడు కిమ్‌ ఇలాంటి సంకేతాలు ఇచ్చారని ఉత్తర కొరియాకు చెందిన పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు