సోదరుడు నామ్‌ని కిమ్మే చంపించాడు!

27 Feb, 2017 19:08 IST|Sakshi
సోదరుడు నామ్‌ని కిమ్మే చంపించాడు!

సియోల్‌: ఉత్తరకొరియాపై దక్షిణకొరియా సంచలన ఆరోపణలు చేసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సోదరుడు కిమ్‌ జాంగ్‌ నామ్‌ హత్య వెనుక ఉత్తర కొరియా ప్రభుత్వ పెద్దలే ఉన్నారని ఆరోపించింది. విదేశాంగ, రక్షణశాఖలో పనిచేస్తున్న మంత్రులు ఉన్నారని పేర్కొంది. ఈ నెల మలేసియా విమానాశ్రయంలో నామ్‌పై విషప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. ఆయనపై వీఎక్స్‌ నెర్వ్‌ అనే అత్యంతప్రమాదమైన విషం ప్రభావం కారణంగా 20 నిమిషాల్లో చనిపోయారు.

ఇది పెద్ద సంచలనం కాగా తొలుత ఉత్తర కొరియా ఏ విధంగానూ స్పందించలేదు. పైగా నామ్‌ పోస్టు మార్టం చేయడానికి మీరెవరు అంటూ మలేషియా ప్రభుత్వాన్ని నిలదీసింది. అయితే, ముందు నుంచే నామ్‌ హత్య వెనుక కీలకంగా కదులుతున్న మలేషియా ఎనిమిదిమందిని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దక్షిణ కొరియా స్పందిస్తూ ఈ ఘటనపై తమ ఇంటెలిజెన్స్‌ నుంచి అందిన సమాచారం ప్రకారం ఉత్తర కొరియా నుంచి నామ్‌ హత్యను ఆపరేట్‌ చేశారని, సాక్షాత్తు ప్రభుత్వంలోని కీలక శాఖలైన విదేశాంగ, రక్షణ శాఖ చట్టప్రతినిధులు ఉన్నారని ఆరోపించింది.

‘నామ్‌ హత్య కేసులో మొత్తం ఎనిమిది మందిని అనుమానిస్తున్నారు. వీరిలో నలుగురు ఉత్తర కొరియా రక్షణ వ్యవహారాలు చూసుకునే వారున్నారు. మరో ఇద్దరు మాత్రం మొత్తం పనిని పూర్తి చేశారు. ఆ ఇద్దరు విదేశాంగ మంత్రిత్వశాఖ వారు’ అని దక్షిణ కొరియా చట్టప్రతినిధి లీ చియోల్‌ వూ ఆరోపించారు. ఇది ముమ్మాటికి ఉత్తర కొరియా చేసిన ఉగ్రవాద చర్యే. నామ్‌ హత్య జరిగిన తర్వాత విచారణ చేసిన మలేషియా పోలీసులు మొత్తం ఎనిమిదిమంది ఉత్తర కొరియా వాసులను అదుపులోకి తీసుకుంది. అలాగే, మలేషియాలోని ఎంబసీ అధికారులను కూడా విచారించనుంది.

మరిన్ని వార్తలు