తూర్పున కొత్తపొద్దు.. బహిరంగ రహస్యం

28 Mar, 2018 09:42 IST|Sakshi

బీజింగ్‌: తూర్పు ఆసియా రాజకీయాల్లో కొత్త పొద్దు పొడిచింది. ‘అంతుచూస్తా.. ఆటంబాబులేస్తా..’అని గర్జించిన స్వరం ఇప్పుడు సంస్కారిలా మారి.. శాంతివచనాలు పలికింది. పెద్దన్న అండతో ప్రపంచదేశాల మనసు గెలుచుకునే ప్రయత్నం విజయవంతంగా సాగుతోంది. అవును. చైనాలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ పర్యటన రహస్యంకాదు.. నూరుశాతం నిజం. కానీ అనధికారం!


గడిచిన కొద్ది గంటలుగా ప్రపంచమంతటా చర్చించుకుంటున్న ‘కిమ్‌ చైనా పర్యటన’కు సంబంధించి బుధవారం అధికారిక ఫొటోలు విడుదలయ్యాయి. అయితే ఇరుదేశాలూ దీనిని ‘అనధికార పర్యటన’గానే పేర్కొనడం గమనార్హం. బీజింగ్‌లోని ప్రఖ్యాత గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌ భవనంలో కొరియా అధ్యక్షుడు కిమ్‌ గౌరవార్థం విందును ఏర్పాటుచేశారు. చైనీస్‌ ప్రెసిడెంట్‌ జీ జింన్‌పింగ్‌ సతీసమేతంగా ఎదురెళ్లి కిమ్‌ దంపతులకు ఆహ్వానం పలికారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన కార్యక్రమం తాలూకు ఫొటోలను చైనా, ఉత్తరకొరియా అధికారిక మీడియా సంస్థలే బహిర్గతం చేశాయి.

ఏం మాట్లాడుకున్నారు?:
ఉత్తరకొరియా అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన తర్వాత కిమ్‌ జాగ్‌ చేసిన తొలి విదేశీ పర్యటన ఇది. అంతర్జాతీయ, ఐక్యరాజ్యసమితి ఆక్షేపణలను పెడచెవినపెడుతూ అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంచుకుంటూపోయిన కిమ్‌ జాంగ్.. వరుస ప్రయోగాలుచేసి అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌ల వెన్నులో వణుకుపుట్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహించిన అమెరికా.. కనీవినీ ఎరుగనిస్థాయిలో ఆంక్షలు విధించి ఉత్తరకొరియాకు అష్టదిగ్భంధం చేసింది. ఆ ఆంక్షల ప్రభావతీవ్రతను గుర్తించిన కిమ్‌.. అణ్వస్త్రాల విషయంలో వెనుకంజవెయ్యకతప్పలేదు. ‘‘అణ్వాయుధాల వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించడానికి ఉత్తరకొరియా కట్టుబడిఉంది. అమెరికాతో, దక్షిణకొరియాతో సౌహార్ద బంధాలను కోరుతున్నాం. దేశాల మధ్య శాంతినెలకొనేందుకు అవసరమైన చర్యలన్నింటికీ మేం సిద్ధంగా ఉన్నాం’’ అని కిమ్‌ జాంగ్‌.. చైనా అధ్యక్షుడికి స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రతిపాదిత భేటీ సజావుగా, సుహృద్భావ వాతావరణంలో జరిగేలా సహకరించాలని చైనాను కిమ్‌ కోరాడు.

అన్నీ తానై నడిపిస్తోన్న చైనా:
తూర్పుఆసియాలో చరిత్ర పొడవునా చైనా-ఉత్తరకొరియాలు సహజ మిత్రులుగా ఉంటూవచ్చాయి. ఇటీవలి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ కిమ్‌జాంగ్‌కు చైనా అండగా నిలిచిన సంగతి తెలిసిందే. అసలు డ్రాగన్‌ సాయంలేనిదే ఉత్తరకొరియా ఒక్క బుల్లెట్‌ కూడా తయారుచేయలేదని విశ్లేషకుల మాట. అయితే, కిమ్‌ వరుస అణుబాంబుల ప్రయోగాలు, ఆ వెంటనే అమెరికా ఆంక్షలను తీవ్రతరం చేయడం, ఒకదశలో ట్రంప్‌.. కొరియాపై యుద్ధం చేస్తారనే ప్రచారం.. కొరియా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. దీంతో తిరిగి ఉత్తరకొరియాను, కిమ్‌ జాంగ్‌ను ప్రపంచం ముందు మంచివారిగా నిరూపించాల్సిన బాధ్యత సహజంగానే చైనాపై పడింది. ఈమేరకు బీజింగ్‌లోని చైనా అధ్యక్షుడి కార్యాలయం ఎప్పటికప్పుడు వైట్‌హౌస్‌తో మంతనాలు జరుపుతూ వచ్చింది. ఉత్తరకొరియా అధ్యక్షుడి పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలను, చర్చించించిన అంశాలను కూడా అమెరికాకు తెలిపింది. తద్వారా ట్రంప్‌-కిమ్‌ల చరిత్రాత్మక భేటీకి రంగం సిద్ధంచేస్తున్నది చైనాయే.

మరిన్ని వార్తలు