కిమ్‌ సోదరికి కీలక బాధ్యతలు

8 Oct, 2017 14:31 IST|Sakshi

సాక్షి : ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ ఉన్‌ అధికారన్ని మరింత బలపరుచుకునే విధంగా అడుగులు వేయబోతున్నాడు. 28 ఏళ్ల తన సోదరి కిమ్‌ జోంగ్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నాడని సమాచారం. తద్వారా కీలక నిర్ణయాలు తీసుకోవటంతోపాటు.. అధికారాన్ని కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉంచాలని భావిస్తున్నాడని స్పష్టమౌతోంది.

ప్యోంగ్‌ యాంగ్‌లో శనివారం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అమెరికా బెదిరింపులతోపాటు జోంగ్‌కు బాధ్యతలు అప్పజెప్పే విషయంపై కూడా చర్చించినట్లు అధికారిక మీడియా సంస్థ కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో కీలక పాలనా విభాగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని కిమ్‌ సమావేశంలో వ్యక్తం చేశాడంట. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్‌ బ్యూరోలో ఆరుగురు అధికారులతోపాటు జోంగ్‌కు కూడా స్థానం కల్పించబోతున్నట్లు కిమ్‌ సూచన ప్రాయంగా చెప్పాడని ఈ కథనం సారాంశం. మానవ హక్కుల ఉల్లంఘన కింద ఆమెపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది.

కరడుగట్టిన నియంతగా పేరొందిన కిమ్‌ తన చెల్లెలికి కీలక బాధ్యతలు అప్పజెప్పటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కిమ్‌ జంగ్ ఉన్, కిమ్‌ యో జోంగ్‌లు ఒకే తల్లికి జన్మించారు. తన పక్కన ఉండే అధికారులతోసహా ఎవరినీ నమ్మని కిమ్‌.. జోంగ్‌ను మాత్రం బాగా నమ్ముతాడని చెబుతుంటారు. అన్నతోపాటు తరచూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆమె ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది కూడా.  ఈ యేడాది ఫిబ్రవరిలో సవతి సోదరుడు కిమ్‌ జోన్‌ నామ్‌ను మలేషియన్ ఎయిర్‌పోర్ట్‌ వద్ద అతిదారుణంగా కెమికల్ దాడి చేయించి కిమ్‌ జంగ్ చంపించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు