‍సైన్యానికి బాధ్యతలు అప్పగించా: కిమ్‌ సోదరి

13 Jun, 2020 21:20 IST|Sakshi
సోదరుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో కిమ్‌ యో జాంగ్‌(ఫైల్‌ఫొటో)

దక్షిణ కొరియాకు కిమ్‌ సోదరి హెచ్చరికలు

ప్యాంగ్‌యాంగ్‌: దక్షిణ కొరియాతో సంబంధాలు తెంచుకునే సమయం ఆసన్నమైందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి, వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా ప్రత్యామ్నాయ పొలిట్‌ సభ్యురాలు కిమ్‌ యో జాంగ్‌ అన్నారు. దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకునే క్రమంలో సైన్యానికి ఇప్పటికే నిర్ణయాత్మక అధికారాలు కట్టబెట్టామని శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సుప్రీం లీడర్‌, మా పార్టీ, ప్రభుత్వం నాకిచ్చిన అధికారాన్ని అనుసరించి.. శత్రు దేశంపై తదుపరి చర్యకు సిద్ధమవ్వాల్సిందిగా సైన్యాధికారులకు ఆదేశాలు జారీ చేశాను. మా ఆర్మీ జనరల్‌ స్టాఫ్‌నకు ఈ బాధ్యతలు అప్పగించాను. దక్షిణ కొరియా అధికారులతో సం​బంధాలు తెంచుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. ఉత్తర- దక్షిణ కొరియాల బంధానికి వేదికగా నిలిచిన, పనికిరాని కట్టడమైన అనుసంధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమయ్యే దృశ్యాలు త్వరలోనే చూడబోతున్నారు’’అని ఆమె హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధికార మీడియా కథనం ప్రచురించింది.(కిమ్‌ సోదరి హెచ్చరిక.. తలొగ్గిన దక్షిణ కొరియా!)

కాగా దక్షిణ కొరియాలో నివసిస్తున్న కొంతమంది నిరసనకారులు, ఉత్తర కొరియా నుంచి వలస వచ్చిన వారు.. ఇటీవల కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నియంతృత్వ ధోరణి, అణ్వాయుధాలపై అతడి విధానాలను ఎండగడుతూ.. కొరియాల సరిహద్దుల్లో బెలూన్లు ఎగురవేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు కిమ్‌ గురించి విమర్శనాత్మక రాతలు రాసిన కరపత్రాలను గాల్లోకి విసిరారు. ఈ నేపథ్యంలో కిమ్‌ సోదరి కిమ్‌ యో జాంగ్‌ నిరసనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని సమర్థిస్తున్న దక్షిణ కొరియాతో సంబంధాలు కొనసాగించబోమని.. ఇరు దేశాల మధ్య కుదిరిన మిలిటరీ ఒప్పందం నుంచి తప్పుకొంటామని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా తన నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్లు శనివారం సంకేతాలు జారీ చేశారు. (అమెరికా తీరుపై ఉత్తర కొరియా అసహనం!)

మరిన్ని వార్తలు