ఓపికను పరీక్షిస్తే.. మరో దారిలో వెళ్లాల్సి ఉంటుంది!

1 Jan, 2019 13:07 IST|Sakshi
ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌

ప్యాంగ్‌యాంగ్‌ : కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణకు తాను కట్టుబడి ఉన్నానని ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పునరుద్ఘాటించారు. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మరోసారి భేటీ అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఈ విషయం గురించి శ్వేతసౌధం తొందర్లోనే ఏదో ఒక నిర్ణయానికి రావాలని విఙ్ఞప్తి చేశారు. అదేవిధంగా తమ మంచితనాన్ని ఎక్కువ కాలం పరీక్షించాలనుకుంటే మాత్రం పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరికలు కూడా జారీచేశారు.

నూతన సంవత్సరం నాడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన కిమ్‌.... ‘అణునిరాయుధీకరణ గురించి ట్రంప్‌తో చర్చించేందుకు ఉత్తర కొరియా సుముఖంగానే ఉంది. అయితే మా సార్వభౌమత్వానికి భంగం వాటిల్లుతుందని అనిపిస్తే మాత్రం మా ధోరణి మరోలా ఉంటుంది. ప్రపంచం సాక్షిగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. అందుకే కొరియా ప్రజలు ఇప్పటిదాకా ఓపికపట్టారు. ఒకవేళ ఈ విషయాన్ని అమెరికా మా చేతకానితనంగా భావించినా, మమ్మల్ని తక్కువగా అంచనా వేసినా నేను మరో దారిలో వెళ్లాల్సి ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలను ఎంతమాత్రం సహించబోం’ అని అగ్రరాజ్యాన్ని హెచ్చరించారు. (ట్రంప్, కిమ్‌ శాంతి మంత్రం)

కాగా అణునిరాయుధీకరణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య గతేడాది(జూన్‌) 12న జరిగిన చరిత్రాత్మక భేటీ విజయవంతమైన విషయం తెలిసిందే. అమెరికా ఆశించినట్లుగానే అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరించగా.. అందుకు ప్రతిగా తమ దేశ భద్రతకు అమెరికా నుంచి కిమ్‌ హామీ పొందారు. అమెరికాతో గత వైరాన్ని పక్కనపెట్టి ముందుకు సాగుతామని, ప్రపంచం ఒక గొప్ప మార్పును చూడబోతుందని కిమ్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు