కిమ్‌ దుస్తులకు క్షణాల్లో 15 కోట్లు

11 Sep, 2019 19:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ప్రముఖ అందాల తార, వ్యాపారవేత్త, మోడల్, 38 ఏళ్ల కిమ్‌ కర్దాషియన్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆమె ‘స్కిమ్‌’ పేరిట మంగళవారం మార్కెట్‌లోకి విడుదల చేసిన శరీరానికి అతుక్కుపోయే మహిళల ‘షేపీ వియర్‌’పై పెద్ద దుమారమే రేగింది. ఎంత పాశ్చాత్య మహిళలే లక్ష్యంగా ఈ దుస్తులను తయారు చేసినప్పటికీ మరీ ఇంతగా శరీరానికి అతుక్కుపోతే ఎలా ? అన్నవాళ్లు, అమ్మాయిల అవయవ సొంపులను అచ్చంగా బయటపెట్టే ఇలాంటి దుస్తులను నిజంగా అమ్మాయిలు ధరిస్తే అబ్బాయిల గుండెలు జారిపోతాయన్నవాళ్లు, అబ్బాయిలు రెచ్చిపోతే అమ్మాయిలకు జరిగే అనర్థాల గురించి భయాందోళనలు వ్యక్తం చేసిన వాళ్లు లేకపోలేదు. 

ఇలాంటి మాటలను ఎప్పుడు లెక్కచేయని కర్దాషియన్‌ తన కొత్త డిజైన్‌ దుస్తులు ‘స్కిమ్‌’కు తానే మోడల్‌గా మార్కెటింగ్‌ చేసింది. మంగళవారం దుస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సేల్స్‌కు పెట్టగా కొన్ని నిమిషాల్లోనే ఆమెకు ఆర్డర్ల రూపంలో రెండు మిలియన్‌ డాలర్లు (దాదాపు 15 కోట్ల రూపాయలు) వచ్చి పడ్డాయి. కొనుగోలుదారుల పోటీ పెరగడంతో ఆమె సేల్స్‌ వెబ్‌సైట్‌ కూడా ‘క్రాష్‌’ అయింది. తొలుత కొన్న వారికి వంద డాలర్లకే డ్రస్‌ అనడంతో తక్కువ ధరకు స్కిమ్‌ దుస్తులను దక్కించుకోవాలనుకున్న వారి మధ్య పోటీ పెరిగింది. ప్రముఖ స్కిన్‌ దుస్తులను తయారుచేసే ప్రముఖ బ్రాండ్‌ ‘స్పాంక్స్‌’కు ఏడాదికి 30 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటే అందులో సగం, అంటే 50 శాతం బిజినెస్‌ను కర్దాషియన్‌ ఒక్క రోజులో సాధించారు. 

ఈ ‘స్కిమ్‌’ దుస్తులకు తన పేరు ధ్వనించేలా ‘కిమినో’ పెట్టాలనుకున్నారు. వివాదం తలెత్తడంతో స్కిమ్‌గానే పేరు మార్చారు. ఆమె ‘డబుల్‌ ఎక్స్‌ ఎస్‌ నుంచి 5 ఎక్స్‌ ఎల్‌’ వరకు వివిధ సైజుల్లో, వివిధ రంగుల్లో దుస్తులను విడుదల చేశారు. ఈ దుస్తుల గురించి తన అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి ఎలాంటి విమర్శలు రావడం లేదని, కేవలం విమర్శకుల నుంచి మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని ఆమె తెలిపారు. తాను డిజైన్‌ చేసిన ఏ దుస్తుల గురించైనా ఎప్పటికప్పుడు అభిమానుల నుంచి అభిప్రాయలను స్వీకరిస్తానని, ఆ అభిప్రాయల మేరకు అవసరమైతే దుస్తుల డిజైన్‌ కూడా మారుస్తానని కిమ్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు