పార్లమెంట్లో మళ్లీ పెప్పర్ స్ప్రే

14 Dec, 2015 20:38 IST|Sakshi
పార్లమెంట్లో మళ్లీ పెప్పర్ స్ప్రే

- నెల రోజుల వ్యవధిలో మూడోసారి సభలో పెప్పర్ స్ప్రే చల్లిన విపక్ష సభ్యులు
- సెర్బియాతో ఒప్పందంపై రగులుతున్న రాజకీయం


ప్రిస్టినా: దక్షిణ ఐరోపా దేశం కొసావోలో రాజకీయ అలజడి మరింత ఉధృతమైంది. ఆ దేశ అత్యున్నత ప్రజాస్వమిక వేదికైన పార్లమెంట్ను 'పెప్పర్ స్ప్రే' మరోసారి కుదిపేసింది. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నిమిషాల్లోనే ప్రతిపక్షానికి చెందిన ఇద్దరు సభ్యులు సభలో పెప్పర్ స్ప్రే చల్లారు. దీంతో పలువురు ఎంపీలు అస్వస్థతతకు గురయ్యారు. సమావేశాలు నిలిచిపోయిన అనంతరం విపక్షాలు సభ వెలుపల ప్రదర్శన నిర్వహించాయి.

పొరుగుదేశం సెర్బియాతో చేసుకున్న ఒప్పందాలను రద్దుచేసుకోవాలని కూటమిగా ఏర్పడ్డ విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఆ మేరకు గడిచిన మూడు నెలలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఒప్పందాలపై వెనక్కి తగ్గేంతవరకు పార్లమెంట్ సమావేశాలు జరగనివ్వబోమని విపక్ష కూటమి గతంలోనే ప్రకటించింది. అయితే విపక్షం లేకుండా అందరూ అధికార సభ్యులతోనే సభను నడిపించేందుకు ప్రభుత్వం సమాయత్తమయింది. దీంతో సభను ఎలాగైనాసరే అడ్డుకోవాలనుకున్న విపక్షాలు ఈ విధంగా పెప్పర్ స్ర్పే దాడులకు దిగింది.

గత నెలలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లోనూ ప్రతిపక్ష సభ్యులు పెప్పర్ స్ప్రే చల్లిన సంగతి తెలిసిందే.సెర్బియా నుంచి స్వాతంత్య్రం పొంది 2008లో దేశంగా ఏర్పడిన కొసావో.. యూరోపియన్ యూనియన్ మధ్యవర్తిత్వంతో పలు అంశాలపై తిరిగి సెర్బియాతో ఒప్పందాలు చేసుకోవడాన్ని ప్రతిపక్షం తప్పుబడుతున్నది. వెంటనే ఆయా ఒప్పందాలు రద్దుచేసుకోవాలని ప్రధాని ఇసా ముస్తఫాను డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు