కుల్‌భూషణ్ కేసులో పాక్ కొత్త కుట్ర

8 Jul, 2020 16:36 IST|Sakshi

ఇస్లామాబాద్‌: ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ యాదవ్‌ కేసులో పాకిస్తాన్ కొత్త కుట్రకు తెరతీసినట్లు కనిపిస్తోంది. ఆయన తన కేసులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి నిరాకరించారని పేర్కొంది. అంతేకాక పెండింగ్‌లో ఉన్న క్షమాభిక్ష పిటిషన్‌తోనే ఆయన ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారని పాక్ ప్రభుత్వం తెలిపింది. జూన్ 17న కుల్‌భూషణ్‌ను రివ్యూ పిటిషన్ వేసుకోవాల్సిందిగా ఆహ్వానించామని.. అందుకు ఆయన నిరాకరించారని పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్ తెలిపారు. భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు మరో అవకాశం ఇచ్చినట్లు పాక్ మీడియా బుధవారం (జులై 8) వెల్లడించింది. ఆయనపై మోపిన ఆరోపణలు, విధించిన మరణశిక్షను పున:సమీక్షించడానికి అవకాశం కల్పించగా.. న్యాయపరంగా తన హక్కులను దృష్టిలో ఉంచుకొని రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయడానికి ఆయన తిరస్కరించారని పాక్‌ మీడియా తెలిపింది.

ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై 2016 మార్చి 3న పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్  ప్రావిన్స్‌లో పాక్ బలగాలు కుల్‌భుషణ్‌ యాదవ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో కులభూషణ్‌కు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇరాన్‌లో వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటుండగా పాక్‌ అక్రమంగా నిర్భందించి, న్యాయస్థానానికి కూడా అనుమతివ్వలేదని భారత్‌ ఫిర్యాదు చేసింది.(మౌనం వీడని శాంతి కపోతం)

దీనిపై విచారణ చేపట్టిన ఐసీజే కుల్‌భూషణ్ మరణశిక్షను నిలిపివేస్తూ 2019 జులై 17న తీర్పు చెప్పింది. కుల్‌భూషణ్ తరఫున న్యాయవాదిని నియమించుకునే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేసింది. దీంతో భారత్‌లో ఆశలు చిగురించాయి.16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పడం గమనార్హం. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటామని గతంలో పాక్ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. కుల్‌భూషణ్ జాదవ్‌ను వెంటనే విడుదల చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది.

>
మరిన్ని వార్తలు