పాక్‌ అధికారులు ఎంత దుర్మార్గులంటే..

26 Dec, 2017 17:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్ జైలు అధికారులు ఎంత దుర్మార్గులో మరోసారి తెలిసిపోయింది. పాకిస్థాన్‌ జైలులో శిక్షను అనుభవిస్తున్న కులభూషణ్‌ జాదవ్‌ను చూసేందుకు వెళ్లినప్పుడు ఆయన తల్లి, భార్యను వారు తీవ్రంగా అవమానించారు. కనీసం సభ్యత పాటించకుండా వ్యవహరించారు. భద్రత పేరు చెప్పి ఓ మతానికి చెందినవారి మనోభావాలు దెబ్బకొట్టేలా పాక్‌ అధికారులు పనిచేశారు. భద్రత పేరుతో వారి మంగళ సూత్రం, గాజులు, ఆఖరికి బొట్టు కూడా తీయించారు. చివరకు వారి మాతృభాషలో కూడా మాట్లాడకుండా అడ్డుకున్నారు. జాదవ్‌ తల్లి పలుమార్లు తన భాషలో ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ పాక్‌ అధికారులు ఆమెను నిలువరించారు. ఈ వివరాలన్నీ భారత విదేశాంగ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

దాదాపు రెండేళ్లుగా పాక్‌ జైలులో కులభూషణ్‌ జాదవ్‌ శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. గూఢచర్యం నిర్వహించారనే పేరిట పాక్‌ అక్రమంగా అరెస్టు చేసి ఉరి శిక్ష విధించి జైలులో ఉంచింది. దీంతో ఆయనను కలిసేందుకు భార్య, తల్లి ఓ భారత డిప్యూటీ హైకమిషనర్‌ వెళ్లారు. అయితే, డిప్యూటీ కమిషనర్‌కు చెప్పకుండానే జాదవ్‌ వద్దకు తల్లిని, భార్యను తీసుకెళ్లిన పాక్‌ అధికారులు ఆ తర్వాత మాత్రమే డిప్యూటీ హైకమిషనర్‌ను అనుమతించారు. అప్పటికీ ఆయనను వారి నుంచి దూరంగానే ఉంచి జాదవ్‌ను కలవనివ్వలేదు. భారత హైకమిషన్‌ వివరాల ప్రకారం పాక్‌ ముందుగా చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా వ్యవహరించలేదు. పూర్తిగా అగౌరవ పరిచింది. పేరుకే వారిని జాదవ్‌తో భేటీకి అనుమతించిందే తప్ప ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించిందని వెల్లడించింది.

మరిన్ని వార్తలు