కువైట్‌ను ముంచెత్తిన వరదలు: మంత్రి రాజీనామా

10 Nov, 2018 13:21 IST|Sakshi

ఎడారి దేశాన్ని వరదలు మళ్లీ  ముంచెత్తాయి. గత నాలుగు  రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చోట్ల  రోడ్లు ధ్వంసమైనాయి. దేశవ్యాప్తంగా పరిస్థితి అతలాకుతమైపోయింది.  ఉరుములతో కూడిన భారీ వర్షం కువైట్‌లో బీభత్సం సృష్టించింది. వీధులన్నీ వరద నీటితో నిండిపోయాయి. రబ్బరు బోట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  దీంతో సౌకర్యాలలేమిపై ప్రభుత్వంపై  తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కువైట్‌  పబ్లిక్‌వర్క్స్‌ మంత్రి హుస్సం అల్-రౌమి రాజీనామా చేశారు.

మరోవైపు అంతర్గత వ్యవహారాల శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది.  సైన్యం, నేషనల్ గార్డ్  భారీ ఎత్తున సహాయక చర‍్యలు చేపట్టింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.  అత్యవసర పరిస్థితుల్లో మినహా బయటికి  రావొద్దంటూ ప్రజలను హెచ్చరించారు. మరోవైపు వర్షధాటికి అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో నెటిజన్లు ట్విటర్‌ ద్వారా ఈ  వరద బీభత్స దృశ్యాలను  పోస్ట్‌ చేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు