‘2 మీటర్ల సామాజిక దూరం తప్పనిసరి’

3 Jun, 2020 12:00 IST|Sakshi

2 మీటర్ల దూరం పాటిస్తే.. మంచిది

ఎక్కువ పొరలున్న మాస్క్‌ శ్రేయస్కరం

తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాప్తికి ఆధారాలు లేవు

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్నప్పటికి వైరస్‌ వ్యాప్తి ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 2 లక్షల మార్కును దాటగా... ఈ ఒక్క రోజే 8 వేల పై చిలుకు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉండగా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికి లాక్‌డౌన్‌ ఎత్తివేత దిశగా కేంద్రం అడగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రత, కనీసం 2 మీటర్ల భౌతిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం వంటి చర్యలు కరోనా బారి నుంచి మనల్ని కాపాడతాయని ప్రసిద్ధ లాన్సెట్‌ జర్నల్‌ ఓ నివేదికను విడుదల చేసింది. 16 దేశాలలో దాదాపు 172 అధ్యయనాలను సమీక్షించిన తర్వాత ఈ నివేదికను వెల్లడించింది. దానిలోని అంశాలు.. 

మాస్క్‌, సామాజిక దూరం అన్ని కలిస్తేనే..
వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం భౌతిక దూరం, మాస్క్‌ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి అంశాలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయని నివేదిక వెల్లడించింది. అయితే ఇందులో ఏ ఒక్కటి ఒంటరిగా కరోనాను కట్టడి చేయలేదని.. వీటన్నింటిని పాటిస్తేనే వైరస్‌ వ్యాప్తిని నిరోధించగలమని నివేదిక తెలిపింది. అంతేకాక వ్యాధి సోకిన వారి నుంచి మీటరు దూరం లోపల ఉన్న వ్యక్తికి వైరస్‌ సోకే అవకాశం 12.8 శాతంగా ఉండగా.. మీటరు కంటే ఎక్కువ దూరం(2మీటర్లు)లో ఉన్నప్పుడు వ్యాప్తి కేవలం 2.6 శాతంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.ఫేస్ మాస్క్ ధరించిన వారికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం 3.1 శాతం ఉండగా.. ధరించని వారికి 17.4 శాతంగా ఉంది. అలానే ఫేస్ షీల్డ్స్, గ్లాసెస్ వాడటం వలన వైరస్‌ వ్యాప్తి 5.5 శాతం తగ్గిందని.. వాడకపోవడం వల్ల 16 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. 

మాస్క్‌ ఎలాంటిది అయినా పర్వాలేదు..
గుడ్డ మాస్క్‌లు, ఆపరేషన్‌ మాస్క్‌లు, ఎన్‌-95 మాస్కులు.. ఇలా ఏది వాడినా మంచిదే అని నివేదిక తెలిపింది. కాకపోతే ఎక్కువ పొరలు ఉన్న మాస్క్‌ ధరించడం మరింత శ్రేయస్కరం అని పేర్కొంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం కిర్బీ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ రైనా మాక్ ఇంటైర్ మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌ సడలించాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు మాస్క్‌ను తప్పనిసరి చేయాలి. ఈ మాస్క్‌లు కూడా నీటిని పీల్చుకోని వస్త్రంతో.. ఎక్కువ పొరలు ఉన్న వాటిని వాడేలా ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం’ అన్నారు.

భారత్‌ను కాపాడే అస్త్రాలు ఇవే..
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో వ్యక్తిగత శుభ్రత, మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల ద్వారా మాత్రమే కేసుల సంఖ్యను తగ్గించగలమని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్, డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఆఫీసులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, బయట ఉన్నా వీటిని పాటించడం మాత్రం మర్చిపోవద్దన్నారు గులేరియా. (అత్యధికం : 24 గంటల్లో 8909 తాజా కేసులు)

తుంపర్ల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి
ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులను పరిశీలిస్తే.. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాపించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు.. కళ్లు, ముక్కు, గొంతు ద్వారా ప్రవేశించి వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నట్లు తెలుస్తుంది. కానీ దీన్ని నిరూపించేందుకు శాస్త్రీయమైన ఆధారాలు లేవని నివేదిక తెలిపింది. 
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు