పుల్వామా దాడి; పాకిస్తాన్‌ వింత వాదన

18 Feb, 2019 10:40 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పొరుగు దేశం మళ్లీ పాత పాటే పాడింది. కశ్మీర్‌లో సాగించిన మారణహోమంలో తమ పాత్ర లేదని బుకాయించింది. భారత్‌ పాలకుల నిష్ఫూచీ కారణంగానే ముష్కరులు రెచ్చిపోయారంటూ వింత వాదనకు దిగింది. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని పాకిస్తాన్‌ ప్రకటించింది. భద్రత, నిఘా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తమపై భారత్‌ అభాండాలు వేస్తోందని పేర్కొంది. ఉగ్రవాద దాడులు జరిగిన ప్రతిసారి తమను బూచిగా చూపడం అలవాటుగా మారిందని ఆరోపించింది.

పుల్వామాలో ఉగ్రదాడి వెనుక మా హస్తం ఉందని భారత్‌ చేసిన ఆరోపణలను తిరస్కరిస్తున్నాం. ఎటువంటి దర్యాప్తు చేపట్టకుండానే దాడి జరిగిన వెంటనే మాపై ఆరోపణలు చేయడం తగద’ని పాక్‌ విదేశాంగశాఖ ప్రతినిధి మహమ్మద్‌ ఫైసల్ ఆదివారం ట్వీట్‌ చేశారు. భారత్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. భద్రత, నిఘా వైఫల్యం కారణంగానే ఉగ్రదాడి జరిగిందన్న ప్రశ్నలకు బదులివ్వాల్సిన అవసరం ఉందన్నారు. పుల్వామా దాడికి తానే కారణమంటూ సూసైడ్‌ బాంబర్‌ ఆదిల్‌ అహ్మద్‌ దర్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియోను భారత్‌ విశ్వసించడాన్ని మహమ్మద్‌ ఫైసల్ తప్పుబట్టారు. ‘ఇండియా ద్వంద్వ వైఖరి బయ​టపడింది. పుల్వామా దాడి తమ పనేనని జైషే చెబుతున్నట్టుగా సోషల్‌మీడియాలో దొరికిన వీడియోను భారత్‌ నమ్ముతోంది. కానీ పాకిస్తాన్‌లో తీవ్రవాద దాడులకు ప్రయత్నించినట్టు మాకు పట్టుబడిన భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌ తనకు తానుగా మా ముందు అంగీకరించినా ఇండియా నమ్మడం లేద’ని ఫైసల్ అన్నారు.

భారత్‌ ఆరోపణలు నిరాధారం
ఘటన గురించి భారత్‌ దుష్ప్రచారం చేస్తోందని పాకిస్తాన్‌ ఆరోపించింది. భారత్‌ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, ఆ దేశం చేస్తోన్న వ్యాఖ్యల కారణంగా శాంతికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆఫ్రికా దేశాల, షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ) దేశాల రాయబారులకు ఆదివారం పాక్‌ వివరించింది. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో పాక్‌ పాత్రపై ఇప్పటికే పలు దేశాలతో భారత్‌ చర్చించింది. పీ5 దేశాలు (అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్‌) సహా మొత్తం 25 దేశాల దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరిపి పాక్‌ విధానాలను ఎండగట్టింది. పాక్‌ విదేశాంగశాఖ ప్రతినిధి మహమ్మద్‌ ఫైసల్, ఆ దేశ విదేశాంగ కార్యదర్శి తెహ్మినా జంజువాతో పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో భారత్‌ వ్యాఖ్యలపై సమావేశమై చర్చించారు. ‘భారత్‌ ఆరోపణలు నిరాధారమైనవి.. భారత్‌ వ్యాఖ్యలతో ఇక్కడి ప్రాంతాల శాంతికి ప్రమాదం కలిగే అవకాశముంది..’ అని ఫైసల్‌ ఎస్‌సీఓ దేశాల రాయబారులకు వివరించారు. ఎస్‌సీఓ దేశాల్లో భారత్, పాక్‌ సహా రష్యా, చైనా, కిర్గిజ్‌ రిపబ్లిక్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ ఉన్నాయి. 

మరిన్ని వార్తలు