అతి పెద్ద ప్రధాన సంఖ్య!

8 Jan, 2018 05:06 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద ప్రధాన సంఖ్యను ఔత్సాహిక శాస్త్రవేత్త కనుగొన్నారు. గతేడాది డిసెంబర్‌ 26న అమెరికాకు చెందిన జొనాథన్‌ పేస్‌ అనే 51 ఏళ్ల ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ ఈ ఘనత సాధించారు. 2ను 7,72,32,917 సార్లు గుణించి, ఆ తర్వాత అందులో నుంచి ‘1’ ని తీసివేశారు. ఆ వచ్చిన సంఖ్యలో 2,32,49,425 అంకెలున్నాయి. ఇప్పటివరకు తెలిసిన ప్రధాన సంఖ్య కన్నా ఎం77232917 అని పిలుస్తున్న ఈ కొత్త ప్రధాన సంఖ్యలో దాదాపు 10 లక్షల అంకెలు ఎక్కువగా ఉన్నాయి. అత్యంత అరుదుగా ఉండే ఈ ప్రధాన సంఖ్యలను మెర్సెన్నె ప్రధాన సంఖ్యలు అంటారు.

350 ఏళ్ల కిందటే ఈ ప్రధాన సంఖ్యల గురించి అధ్యయనం చేసిన ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త మారిన్‌ మెర్సెన్నె పేరు వీటికి పెట్టారు. ఈ కొత్త ప్రధాన సంఖ్యను ఆరు రోజుల పాటు ఆగకుండా లెక్కించారు. ఎం77232917 ఇప్పటి వరకు కనుగొన్న 50వ మెర్సెన్నె ప్రధాన సంఖ్య. గ్రేట్‌ ఇంటర్నెట్‌ మెర్సెన్నె ప్రైమ్‌ సెర్చ్‌ (జీఐఎంపీఎస్‌) అనే సాఫ్ట్‌వేర్‌ సాయంతో ప్రధాన సంఖ్యలు కనుగొనేందుకు వేల మంది వలంటీర్లు నిత్యం ప్రయతిస్తుంటారు. ఈ ప్రధాన సంఖ్యను కనుగొన్న వారికి రూ.50 వేలను పారితోషికంగా అందిస్తారు. జొనాథన్‌ పేస్‌ గత 14 ఏళ్లుగా ప్రధాన సంఖ్యను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మరిన్ని వార్తలు