ఫుట్‌పాత్‌లపై పడుకోవడం నేరం!

8 Nov, 2019 19:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లాస్‌ వెగాస్‌ నగరంలో ఫుట్‌పాత్‌లపై ప్రజలెవరూ పడుకోకుండా నగర పాలక మండలి కొత్త చట్టం తీసుకొచ్చింది. రాత్రి. పగలు తేడా లేకుండా అన్ని వేళల్లో ఫుట్‌పాత్‌లపై టెంట్లు వేసుకొని గానీ, నిద్రపోతూ ఎవరైనా కనిపిస్తే దాన్ని నేరంగా పరిగణించి వెయ్యి డాలర్ల జరిమానా విధిస్తారు. అమెరికాలో ఇలాంటి చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి నగరంగా కూడా లాస్‌ వెగాస్‌కు గుర్తింపు ఉంది. గతంలో బాయిస్, ఇదాహో నగరాలు ఇలాంటి చట్టాలను తీసుకరాగా అమెరికా సర్క్యూట్‌ కోర్టులు కొట్టివేశాయి.

ఈసారి ఇక్కడ అలా జరగదని సిటీ అలార్నీ బ్రాడ్‌ జెర్బిక్‌ చెప్పారు. ‘ప్రభుత్వ షెల్టర్లలో పడకలు ఖాళీగా ఉన్నప్పుడు’ అనే క్లాజ్‌ చట్టంలో తీసుకొచ్చామని ఆయన తెలిపారు. పేద ప్రజలకు ఉద్దేశించిన ప్రభుత్వ షెల్టర్లలో పడకలు ఖాళీగా ఉంటున్నాయని కూడా ఆయన చెప్పారు. లాస్‌ వెగాస్‌లో పేద ప్రజలే కాకుండా, డ్రగ్స్‌కు అలవాటు పడిన వాళ్లు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు ఫుట్‌పాత్‌లపై పడుకుంటున్నారు. నగరంలో అద్దెలు ఎక్కువ అవడం వల్ల కూడా చాలా మంది ఫుట్‌పాత్‌లను ఆశ్రయిస్తున్నారు. 

పర్యాటకుల రద్దీ ఎక్కువ ఉన్న చోట్ల ఈ చట్టాన్ని మినహాయించినట్లు అటార్నీ తెలిపారు. బుధవారం నాడే ఈ చట్టాన్ని తీసుకొచ్చిన నగర పాలక మండలి తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. వెయ్యి డాలర్లు కట్టలేని వాళ్లను జైళ్లకు పంపిస్తామని చెబుతున్నారుగానీ ఎన్ని రోజులు పంపిస్తారన్నది చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు