కరోనా నుంచి రక్షణకు సరికొత్త మాస్క్‌లు

7 Apr, 2020 17:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ బారిన పడకుండా తప్పించుకునేందుకు ప్రజలు రకరకాల మాస్క్‌లు వాడుతున్నారు. అవి మామూలు ధరల నుంచి అసాధారణ ధరల వరకు ఉండడమే కాకుండా నాసిరకం నుంచి నాణ్యమైనవి వరకు ఉన్నాయి. ఎంత ఖరీదు పెట్టి కొన్న ఎంతటి నాణ్యమైనా మాస్క్‌ అయినా సరే దానిపై కరోనా వైరస్‌ వారం రోజుల పాటు బతికుండే అవకాశం ఉందంటూ లండన్‌ వైద్యులు తేల్చిన నేపథ్యంలో ప్రజలకు కొత్త భయాలు పట్టుకున్నాయి. పైగా మాస్క్‌లు ధరించడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. కొందరికి శ్వాస సరిగ్గా ఆడదు. కొందరికి దురద పెట్టినట్లు ఉంటుంది. ఏదేమైనా చీకాకుగా ఉంటుందనడంలో సందేహం లేదు.మాస్క్‌ అంటే ముఖాన కప్పుకునే ముకుమల గుడ్డలా మెత్తగా ఉండాలి. పైగా ఏరోజుకారోజు పారేసే దానిలా కాకుండా ఏ రోజుకారోజు ఉతుక్కుని మళ్లీ ధరించేలా ఉండాలి. వీలయితే కరోనా వైరస్‌ను ఆకర్షించి చంపేసే రసాయనంతో కూడినదై ఉండాలి.(ఈ టెక్నిక్‌తో కరోనా వైరస్‌కు చెక్‌!)

ప్రొఫెసర్‌ సబీనా ష్లిష్‌ అచ్చం ఇలాగా ఆలోచించినట్లు ఉన్నారు. ఆమె చేసిన సూచనల మేరకు అచ్చం ఇలాగే ఉపయోగపడే మాస్క్‌లను ‘మాన్‌చెస్టర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ’ పరిశోధకులు తయారు చేశారు. వీటిని మామూలుగా మాస్క్‌లనకుండా ‘స్నూద్‌’అని పిలుస్తున్నారు. అవి మెడ కింది నుంచి ముఖంపైన కళ్లవరకు ముసుగు ధరించినట్లు ఉండడమే అందుకు కారణం.

మనం ముక్కు నుంచి శ్వాసను పీల్చుకునే నాళం పైభాగాన ప్రొటీన్ల మిశ్రమం ఉన్నట్లే ఈ స్నూద్‌కు ప్రొటీన్ల మిశ్రమం పూత ఉంటుందని, అది వైరస్‌లను ఎదుర్కోవడానికి మనకు శక్తినిస్తుందని, అలాగే ప్రొటీన్ల పూతకు పై భాగాన వైరస్‌లను నిర్వీర్యం చేసే రసాయనం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ప్రొటీన్లు ఉన్నప్పుడే కెమికల్‌ రియాక్షన్‌ ఉంటుందని, లేకపోతే లేదని వారు చెప్పారు. ఈ స్నూద్‌లను ఏ రోజుకారోజు ఉతుక్కొని మళ్లీ ధరించవచ్చని కూడా చెప్పారు. అయితే ఎన్ని రోజుల వరకు దాన్ని ధరించవచ్చో, ఎన్ని రోజుల వరకు దానిపై ప్రొటీన్లు, రసాయనం పూత ఉంటుందో వారు చెప్పలేదు. తల పైభాగం నుంచి ధరించే ఈ స్నూద్‌లు ఆన్‌లైన్‌ మార్కెట్‌లో 20 పౌండ్లకు (దాదాపు 1800 రూపాయలు) అందుబాటులో ఉన్నాయి.(మనిషి నుంచి పులికి సోకిన కరోనా వైరస్‌)

మరిన్ని వార్తలు