తాజా ఫొటోలు: చైనా పన్నాగాలు బట్టబయలు!

24 Jun, 2020 20:28 IST|Sakshi
ఫోటో కర్టెసి: మాక్సర్‌ టెక్నాలజీ

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని అన్ని వివాదాస్పద, ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి బలగాలను ఉపసంహరించాలని ఇరు దేశాలు ఏకాభిప్రాయానికొచ్చిన మరునాడే చైనా పన్నాగాలు బయటపడ్డాయి. ఒకవైపు రెండు దేశాల లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ స్థాయి అధికారుల చర్చలు జరుగుతుండగానే డ్రాగన్‌ దేశం ఉద్రిక్త ప్రాంతంలో పనులు కొనసాగించింది. తాజాగా విడుదలైన హై రిజల్యూషన్‌ ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో గల్వాన్‌ నది వద్ద వాస్తవాధీన రేఖకు ఇరువైపులా చైనా పలు రక్షనాత్మక నిర్మాణాలు చేపట్టినట్టు వెల్లడైంది. భారత్‌-చైనా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న ప్యాట్రోల్‌ పాయింట్‌ 14 వద్ద చైనా బలగాలకు వసతి గృహాలు, గల్వాన్‌ నదిపై కల్వర్టు చేపట్టినట్టు తెలుస్తోంది. జూన్‌ 22కు సంబంధిచిన ఈ ఉపగ‍్రహ చిత్రాలను మాక్సర్‌ టెక్నాలజీస్‌ విడుదల చేసింది. వీటి ప్రకారం ప్యాట్రోల్‌ పాయింట్‌ 14 వద్ద మే 22న ఒక్క టెంట్‌ మాత్రమే ఉండగా.. తాజాగా వెలువడ్డ చిత్రాలు చైనా రక్షణాత్మక స్థానాలను చూపుతున్నాయి.
(చదవండి: బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు)

దాంతో పాటు గల్వాన్‌ నది వద్ద రోడ్డు వెడల్పు పనులనూ చైనా చేపట్టినట్టు తెలుస్తోంది. అంతకుముందు విడుదలైన ఛాయాచిత్రాల్లో అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. ఒక టెంట్‌ మాత్రమే ఉంది. కాగా, చైనా ఆకస్మిక దాడికి చేసేందుకే వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణాత్మక నిర్మాణాలు చేపట్టి ఉండొచ్చని రిటైర్డ్‌ ఆర్మీ మేజర్‌ జనరల్‌ రమేశ్‌ పాధి అనుమానం వ్యక్తం చేశారు. బలగాలను మోహరించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఇక జూన్‌ 15 రాత్రి జరిగన ఘర్షణల్లో కల్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు అమరలైన సంగతి తెలిసిందే. ఇక తమ వైపు నుంచి ఒక కమాండర్‌ మృతి చెందినట్టు చైనా అంగీకరించినట్టు తెలిసింది. 45 మంది సైనికులు కూడ మరణించినట్టు అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి.
(చదవండి: బలగాల ఉపసంహరణ)

>
మరిన్ని వార్తలు