గుడ్‌న్యూస్: మార్స్‌పై చిగురిస్తున్న ఆశలు!

13 Dec, 2017 11:03 IST|Sakshi

వెల్లింగ్టన్ : అంగారక గ్రహం (మార్స్‌)పై జీవం మనుగడ సాగించగలదా.. అక్కడి బౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న ఆసక్తికర విషయాలు త్వరలోనే మనకు తెలిసే అవకాశాలున్నాయి. ఇటీవల కనుగొన్న ప్రపంచంలోనే కొత్త ద్వీపం, మార్స్ పై మనకు తెలియని కీలక విషయాలు తెలుసుకునేందుకు దోహదపడుతుందని నాసా ప్రయోగాలలో తేలింది. టోంగా రాజధాని నుకుఅలోఫాకు వాయవ్యదిశలో 65 కిలోమీటర్ల దూరంలో హంగా టోంగా హంగా హాపాయ్ రోస్ అనే ద్వీపాన్ని ఇటీవల గుర్తించారు. మార్స్ మీద కోట్ల ఏళ్ల కిందట ఏర్పడిన ద్వీపాలు, ద్వీపకల్పాలకు సంబంధించిన సమాచారం ఈ కొత్త ద్వీపంపై జరిపే పరిశోధనలతో తెలియనుందని నాసా విశ్వసిస్తోంది.

సాధారణంగా భూమిపై ఉండే వాతావరణం ఇక్కడ లేదని, ఈ ద్వీపంలో భౌగోళిక పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయని నాసా గోడార్డ్ స్పెస్ ఫ్లైట్ సెంటర్ చీఫ్ సైంటిస్ట్ జిమ్ గార్విన్ వెల్లడించారు. అగ్నిపర్వతాలు బద్ధలు కావడంతో ఏర్పడిన ద్వీపంలో అంగారకుడితో పోల్చదగ్గ వాతావరణం ఉన్నట్లు భావిస్తున్నారు. అగ్నిపర్వతాలు బద్ధలవ్వడంతో టఫ్ అనే సిమెంట్ కంటే గట్టి పదార్థాలు తయారయ్యాయని.. అక్కడక్కడ గుంతలు గుంతలుగా భూభాగం ఉందన్నారు. అంగారకుడిపై కూడా అగ్నిపర్వతాలు బద్ధలవడంతో ఉద్భవించిన ఎన్నో ద్వీపాలున్నాయని, టోంగా సమీపంలోని ద్వీపంపై పరిశోధనలతో మార్స్ పై జీవం మనుగడ, ఉనికిపై స్పష్టత వస్తుందని నాసా శాస్త్రవేత్త వివరించారు.

హంగా టోంగా హంగా హాపాయ్ రోస్ ద్వీపంపై నాసా శాస్త్రవేత్తల బృందం చేస్తున్న పరిశోధనలపై చర్చించేందుకు ఈ వారం న్యూ ఓర్లీన్స్ లో అమెరికన్ జియోగ్రాఫికల్ యూనియన్ సమావేశం జరగనుంది. చంద్రుడిపైకి మరోసారి మనుషులను పంపాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాసా శాస్త్రవేత్తలకు సూచించిన విషయం తెలిసిందే. దీంతో భవిష్యత్తులో మార్స్‌పైకి మరిన్ని ప్రయోగాలు చేపట్టేందుకు అమెరికా సన్నద్ధమవుతుందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు