‘అమెరికాకు పాకిస్తాన్‌ వెన్నుపోటు’

24 Aug, 2018 16:28 IST|Sakshi

వాషింగ్టన్‌: తీవ్రవాదం అంతమొందించే విషయంలో అమెరికాకు పాకిస్తాన్‌ వెన్నుపోటు పొడించిందని యూఎస్‌ ఆర్మీ మాజీ కల్నల్‌ లారెన్స్‌ సెల్లిన్‌ ఆరోపించారు. తాలిబన్‌తోపాటు, ఇతర ఉగ్ర సంస్థలతో పాక్‌ వ్యవహరించే తీరు పలు అనుమానాలకు తావిస్తుందని ఆయన అన్నారు. అప్ఘనిస్తాన్‌, ఉత్తర ఇరాక్‌లలో యూఎస్‌ ఆర్మీ తరఫున పనిచేసిన సెల్లిన్‌ తన అభిప్రాయాలను ఓ అర్టికల్‌లో వెల్లడించారు. 2001లో అమెరికా అఫ్ఘనిస్తాన్‌పై దాడులు ప్రారంభించగానే పాక్‌ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ) తాలిబన్‌లకు ఆయుధాలను, పేలుడు పదార్థాలను సరాఫరా చేసిందని తెలిపారు.

అప్పటి పాక్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌, అప్పటి ఐఎస్‌ఐ డైరక్టర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మహ్మద్‌ అహ్మద్‌తో పాటు ఇతర ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారని.. ఆ సమావేశంలో తాలిబన్‌, అల్‌ఖైదాలకు వ్యతిరేకంగా యూఎస్‌ జరిపే దాడులకు సహాయం చేయరాదని నిర్ణయం తీసుకున్నట్టు సెల్లిన్‌ పేర్కొన్నారు. ఇలా 17ఏళ్ల నుంచి పాక్‌ కపట నాటకం ఆడుతూనే ఉందని విమర్శించారు. ఓ వైపు అమెరికా నుంచి బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం పొందుతూ.. మరోవైపు నెమ్మదిగా అఫ్ఘనిస్తాన్‌లో అమెరికా బలగాలను దెబ్బతీసేందుకు తాలిబన్‌, హకానీ నెట్‌వర్క్‌ గ్రూపులకు సహాయం చేసిందని మండిపడ్డారు.

తాలిబన్‌ గాడ్‌ ఫాదర్‌గా పేరు గాంచిన పాక్‌ ఐఎస్‌ఐ మాజీ చీఫ్‌ హమీద్‌ గుల్‌, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏదో ఒక రోజు ఐఎస్‌ఐ, యూఎస్‌ సహాయంతో అఫ్ఘనిస్తాన్‌ నుంచి సోవియట్‌ యూనియన్‌ బలగాలను బయటకు పంపుతోందని, అలాగే యూఎస్‌ సహాయంతోనే యూఎస్‌ను అఫ్ఘనిస్తాన్‌ నుంచి పంపిచి వేస్తామని చేసిన వ్యాఖ్యలను సెల్లిన్‌ గుర్తుచేశారు. 2001కి ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆయన అన్నారు. ప్రస్తుతం తాలిబన్‌ బలగాలు పాక్‌లోనే తలదాచుకుంటున్నాయని.. వారికి కావాల్సిన రిక్రూట్‌మెంట్‌, ట్రైనింగ్‌ అంత అక్కడే జరుగుతోందని ఆయన తెలిపారు. ఐఎస్‌ఐ కూడా ఇందులో కీలక భూమిక పోషించడం బహిరంగ రహస్యమేనని పేర్కొన్నారు. అలాగే చైనా కూడా పాక్‌కు సలహాలు అందజేస్తుందని ఆయన ఆరోపించారు.

మరిన్ని వార్తలు