అమెరికాలో ఫ్లోరెన్స్‌ విధ్వంసం

16 Sep, 2018 03:47 IST|Sakshi
ఉత్తర కరోలినా రాష్ట్రంలోని విల్మింగ్టన్‌లో వరద నీటిలో చిక్కుకున్న కార్లు

భారీ వర్షాలు, వరదలకు ఏడుగురు మృతి

తీవ్రత తగ్గినా భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరిక

విల్మింగ్టన్‌: అమెరికా తూర్పుతీరాన్ని తాకిన ఫ్లోరెన్స్‌ హరికేన్‌ విధ్వంసం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులన్నీ పొంగిపొర్లుతుండటంతో భారీగా వరద పోటెత్తుతోంది. ఫ్లోరెన్స్‌ కారణంగా ఇప్పటివరకూ అమెరికాలో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. తుపాను కారణంగా ట్రెంట్, నూస్‌ నదులు పొంగిపొర్లుతుండటంతో ఉత్తర కరోలినాలోని న్యూబెర్న్‌ పట్టణంలో చాలా మంది 10 అడుగుల ఎత్తైన వరదలో చిక్కుకున్నట్లు వెల్లడించారు.

న్యూబెర్న్‌ నుంచి ఇప్పటివరకూ 400 మందిని రక్షించామనీ, మిగిలినవారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బలమైన ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. కాగా, ఫ్లోరెన్స్‌ హరికేన్‌ తీవ్రత ‘ఉష్ణమండల తుపాను’ స్థాయికి తగ్గినప్పటికీ గంటకు 112 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయనీ, కుంభవృష్టి సంభవిస్తుందని జాతీయ హరికేన్‌ కేంద్రం(ఎన్‌హెచ్‌సీ) ప్రకటించింది. మరోవైపు ఈ విషయమై ఉత్తర కరోలినా గవర్నర్‌ రాయ్‌ కూపర్‌ స్పందిస్తూ.. ‘ఫ్లోరెన్స్‌ విధ్వంసం మరో 2–3 రోజులు కొనసాగే అవకాశముంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 7.6 లక్షల మంది చీకట్లో మగ్గుతుండగా, 21,000 మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

ఫ్లోరెన్స్‌ ప్రభావంతో కుంభవృష్టి కురవడంతో పాటు అకస్మాత్తుగా వరదలు పోటెత్తే ప్రమాదముంది. ఈ విషయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. ఫ్లోరెన్స్‌ దెబ్బకు అతలాకుతలమైన ప్రాంతాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటిస్తారని వైట్‌హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తర కరోలినా, వర్జీనియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని దాదాపు 17 లక్షల మంది ప్రజలను అధికారులు ఇప్పటికే ఆదేశించారు. ఫ్లోరెన్స్‌ సహాయక చర్యల్లో పాల్గొంటున్న అమెరికా విపత్తు నిర్వహణా సంస్థ(ఫెమా)ను అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసించారు.

ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం
మనీలా: మంగ్‌ఖుట్‌ టైఫూన్‌ ప్రభావంతో ఫిలిప్పీన్స్‌లోని ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. దీని కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకూ 12 మంది దుర్మరణం చెందగా, ఆరుగురు గల్లంతయ్యారు. గంటకు 170 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. సహాయక చర్యల కోసం రెండు సీ–130 హెర్క్యులస్‌ విమానాలతో పాటుæహెలికాప్టర్లను అందు బాటులో ఉంచారు. 50 లక్షల మందిపై టైఫూన్‌ ప్రభావం చూపుతోంది.
 

మరిన్ని వార్తలు