రాష్ట్రపతి లేక స్వాతంత్ర్య వేడుకలు రద్దు!

22 Nov, 2014 14:17 IST|Sakshi
రాష్ట్రపతి లేక స్వాతంత్ర్య వేడుకలు రద్దు!

బీరట్: లెబనాన్ నిజానికి ఎంతో అందమైన ప్రకృతి సౌందర్యం కలిగిన దేశమే అయినా నిత్యం ఏదో మూలన బాంబులతో దద్దరిల్లుతూనే ఉంటుంది. లెబనాన్ కు గణతంత్ర పార్లమెంట్ తరహా ప్రభుత్వ హోదా ఉంది. అయితే ఈ సంవత్సరం ఆ దేశంలో స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడం లేదు. 1943, నవంబర్ 22వ తేదీన లెబనాన్ స్వాతంత్య్ర దేశంగా అవతరించింది. ఆ దేశం డబ్బై రెండో ఒడిలో అడుగుపెడుతున్నా.. గణతంత్ర వేడుకలకు మాత్రం దూరంగా ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఆ దేశ రాష్ట్రపతిగా ఎవరూ పదవిలో లేకపోవడమే.

 

మైకేల్ సులేమాన్ మే 25 వ తేదీన రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయడంతో అప్పట్నుంచి ఆ పదవీ ఖాళీగానే ఉంది. దీనిపై పార్లమెంట్ 15 సార్లు సమావేశమైనా రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో విఫలమైంది. దీనిపై ఈ బుధవారం కూడా పార్లమెంట్ సమావేశమైంది. అయితే 128 సభ్యులున్న పార్లమెంట్ కు 56 సభ్యులు మాత్రమే హాజరుకావడంతో మరోసారి నిరాశ తప్పలేదు. దీంతో స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడానికి లెబనాన్ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. గత ఆరు నెలల నుంచి ఆ స్థానంలో ఎవరూ లేకపోవడంతో స్వాతంత్ర్య వేడుకలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని తమ్మామ్ సలామ్ స్పష్టం చేశారు. అధికారిక కార్యక్రమలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రధాని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

 

మరిన్ని వార్తలు