1..2..3 లైట్స్ ఆన్!

12 Dec, 2016 15:05 IST|Sakshi
1..2..3 లైట్స్ ఆన్!

ఇంట్లో లైట్ అనగానే మనం పైకప్పు కేసి చూస్తాం. ఎందుకంటే ఏ ఇంట్లోనైనా దీపాలు అక్కడే ఉంటాయి. అవసరమైనప్పుడు వెలుతురు ఎక్కువ తక్కువయ్యే అవకాశం లేదు. రంగులు మారే ప్రశ్నే రాదు. ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్స్ కొన్నింటిలో ఇతర హంగులన్నీ ఉన్నా... వెలుతురును ఒక స్థాయి వరకూ మాత్రమే పెంచుకోవచ్చు. ఇప్పుడు పక్క ఫొటోను చూడండి. ఇందులో షడ్భుజి ఆకారంలో కనిపిస్తున్నవి ఓ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన హీలియోస్ బల్బులు. ఒకొక్కటి 4.3 అంగుళాల వెడల్పు, ఒక అంగుళం మందం ఉంటాయి. 6.3 వాట్ల విద్యుత్తును వాడుకుని 400 ల్యూమెన్ల వెలుతురునిస్తాయి.
 

మన లైటింగ్ అవసరాలను బట్టి ఒకదానితో ఒకటి అతికించుకుంటూ పోవచ్చు. ఇలా దాదాపు 105 బల్బులను జోడించుకుంటూ వెళ్లవచ్చునని కంపెనీ చెబుతోంది. ఇందుకోసం అయస్కాంతంగా, ఎలక్ట్రిక్ కనెక్షన్‌గానూ ఉపయోగపడేలా ప్రత్యేకమైన ఫిటింగ్‌‌సను ఉపయోగించారు. ముట్టుకుంటే.. ఆన్/ ఆఫ్ అయిపోతాయి. రంగులు మార్చుకోవడం, వెలుతురు స్థాయిని పెంచుకోవడం కూడా స్మార్ట్‌ఫోన్ ఆప్‌తో సునాయాసంగా చేయవచ్చు. ప్రస్తుతం కిక్‌స్టార్టర్ ద్వారా నిధులు సేకరిస్తున్న కంపెనీ వచ్చే ఏడాది వీటిని మార్కెట్‌లోకి తీసుకొస్తామని అంటోంది.

మరిన్ని వార్తలు