పాఠశాలలు ధ్వంసం.. చదువు చట్టుబండలు!

27 Jul, 2016 16:52 IST|Sakshi
పాఠశాలలు ధ్వంసం.. చదువు చట్టుబండలు!

అంతర్యుద్ధంతో రగలిపోతున్న లిబియాలో పిల్లల చదువు చట్టుబండలవుతోందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తంచేసింది. అంతర్యుద్ధ దాడుల్లో  పాక్షికంగా లేదా పూర్తిగా పాఠశాలలు ధ్వంసమై మూతపడడం లేదా పాఠశాలలు శరణార్థుల కేంద్రాలుగా మారిపోవడం వల్ల పిల్లలు చదువుకు దూరం అయ్యారని ఆవేదన వ్యక్తంచేసింది. అలా చదువుకు దూరమైన బడిపిల్లల సంఖ్య 2,79,000 ఉంటుందని ఐక్యరాజ్య సమితి మానవీయ వ్యవహారాల సమన్వయ కార్యాలయం తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 558 పాఠశాలలు పనిచేయడం లేదని పేర్కొంది.

2014 నుంచి లిబియాలో అంతర్యుద్ధం తీవ్రమైంది. ఐక్యరాజ్యసమితి మద్దతుతో నడుస్తున్న లిబియా సంకీర్ణ ప్రభుత్వం బలగాలకు, తిరుగుబాటు వర్గాలకు మధ్య ఈ పోరాటం కొనసాగుతోంది. తిరుగుబాటు వర్గాల్లో ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు కూడా ఉన్నారు. ఐఎస్ టెర్రరిస్టుల దాడుల కారణంగా సిర్తీ నగరంలో మూడో వంతు జనాభా మరణించింది. 35 వేల మంది ప్రజలు వలసపోయారు. ఇస్లామిక్ టెర్రరిస్టుల బారి నుంచి సిర్తీ నగరాన్ని ప్రభుత్వ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నా.. అక్కడ కనీస వసతులు లేవని ప్రజలెవరూ నగరానికి తిరిగి రావడానికి ఇష్టపడడం లేదు.

అంతర్యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న సిర్తీ నగరంతోపాటు బెంఘాజి నగరంలో కూడా దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో లేవు. క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయి. వారికి సరైన మందులు కూడా అందడం లేదు. ఈ అంతర్యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో తెలియక ప్రజలు దినదిన గండంగా బతుకుతున్నారు. 2011లో మహ్మద్ గఢాఫీ ప్రభుత్వాన్ని కూలదోసినప్పటి నుంచి లిబియాలో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు