పెరట్లో పార్క్ చేసుకోవచ్చు..

9 May, 2016 02:19 IST|Sakshi
పెరట్లో పార్క్ చేసుకోవచ్చు..

అవును.. ఈ ప్రైవేట్ జెట్‌ను పెరట్లోనే పార్క్ చేసుకోవచ్చు. కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఈ ఎలక్ట్రిక్ జెట్ పేరు లిలియం. గంటకు 250 మైళ్ల వేగంతో దూసుకుపోయే ఈ జెట్ టేకాఫ్, ల్యాండింగ్ నిట్టనిలువుగా చేయడం వల్ల దీనికి 50 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు ఉన్న స్థలం సరిపోతుందట. అంటే.. ఎయిర్‌పోర్టులతో పనిలేదు. కాసింత విశాలంగా ఉన్న పెరట్లోనే పార్క్ చేసుకోవచ్చు. దీన్ని జర్మనీకి చెందిన డేనియల్ వెగాండ్, పాట్రిక్ నాథెన్, సెబాస్టియన్ బార్న్, మథియాస్ అనే నలుగురు ఇంజనీర్లు డిజైన్ చేశారు. రోజువారీ జీవితంలో ఉపయోగించుకునే ప్రైవేటు జెట్‌ను తయారుచేయడంలో భాగంగా దీన్ని రూపొందించినట్లు డేనియల్ తెలిపారు. ధ్వని, వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఇందులో ఎలక్ట్రిక్ ఇంజిన్లను వాడినట్లు చెప్పారు.
 
 బ్యాటరీలతో సాయంతో నడుస్తుందని తెలిపారు. ప్రస్తుతం రూపొందించిన డిజైన్.. రాత్రి వేళల్లో ప్రయాణించేందుకు వీలుపడదు. సాయంత్రం సమయానికి తిరిగొచ్చేయాలన్నమాట. అంతేకాదు.. అననుకూల వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణం పెట్టుకోకపోవడమే బెటరని చెబుతున్నారు.  మిగిలిన ప్రైవేటు జెట్లతో పోలిస్తే.. ఇది పర్యావరణ అనుకూలమని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ చెబుతోంది.   2018లో మార్కెట్లోకి రానుంది. ధరను ఇంకా ప్రకటించలేదు.
 
 లిలియం..

ప్రయాణికుల సామర్థ్యం:     2
 స్టీరింగ్:     సులభం..
 (అంతా కంప్యూటర్ కంట్రోల్డ్ సిస్టమ్)
 అత్యధిక టేకాఫ్ సామర్థ్యం:
 600 కిలోలు..
 వేగం:     గంటకు 180 మైళ్లు
 అత్యధిక వేగం:     250 మైళ్లు
 పవర్:     435 హెచ్‌పీ
 ప్రయాణం:     ఏకధాటిగా 300 మైళ్లు

మరిన్ని వార్తలు